ద‌స‌రా లోపు ఉపాధ్యాయుల‌ నియామ‌కాలు : సీఎం రేవంత్ రెడ్డి

  • వొచ్చే నెల 9న నియామ‌క ప‌త్రాలు అందిస్తాం..
  • గ‌త ప‌దేళ్ల‌లో విద్యారంగం నిర్వీర్య‌మైంది..
  • డీఎస్సీ 2024 ఫ‌లితాల విడుద‌ల కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 : దసరా లోపు కొత్త‌ టీచర్ ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తామ‌ని, అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమ‌వారం డీఎస్సీ-2024 ఫలితాల (DSC Results – 2024) విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 11062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు విడుదల చేశామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క‌సారే డీఎస్సీ నోటిఫికేషన్ విడుద‌ల చేసింద‌ని, పదేళ్లలో వారు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం 7,857 మాత్రమేన‌ని ఆరోపించారు. అంద‌రికీ నాణ్య‌మైన‌ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదని విమ‌ర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలుపెట్టామ‌ని తెలిపారు. డీఎస్సీ నిర్వహణలో 65 రోజుల్లో 1,1062 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తున్నామ‌ని ఇది విద్యపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణలో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష అని, అధికారంలోకి వొచ్చిన 30 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామ‌ని తెలిపారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహణ తర్వాతే డీఎస్సీ నిర్వహించామ‌ని, టీజీపీస్సీని ప్రక్షాళన చేశామ‌ని, త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి ఏడాదిలోనే 60వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నాం. టీచర్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదు.. అది భావోద్వేగమ‌ని, గత పదేళ్లలో విద్యాశాఖ‌ నిర్లక్ష్యానికి గురైందని, మేం వొచ్చాక విద్య శాఖకు నిధులను పెంచామని భవిష్యత్ లో మరిన్ని నిధులు కేటాయిస్తామ‌న్నారు.

గత ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించలేదని, అందుకే త‌మ‌ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంద‌ని, 100 నియోజకవర్గాల్లో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో ఏర్పాటు చేస్తున్నామ‌ని, గత ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదని, త‌మ‌ ప్రభుత్వం వివాదాలకు తావు లేకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసింద‌ని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై త‌మ‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని, పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిప‌డ్డారు. అందుకే ఈ ఉపద్రవం వచ్చింద‌ని, వాటన్నింటిని పరిష్కరించుకుంటూ మేం ముందుకెళుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యపై పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని మేం భావిస్తున్నామ‌ని, విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తామ‌ని చెప్పారు. .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page