– సంస్థ యాజమాన్యానికి సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
– జహీరాబాద్‌లో రూ.8,528 కోట్లతో గ్లోబల్ ఆర్అండ్డీ కేంద్రం-
– పెండింగ్ అనుమతులను వెంటనే పూర్తి చేయాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: తెలంగాణను కార్ల తయారీకి అనువైన ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో హ్యుందాయ్ కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్ గ్లోబల్ ఆర్అండ్డీ కేంద్రానికి సంబంధించిన పెండింగ్ అనుమతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్ఎంఐఈ) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, జహీరాబాద్‌లో ప్రతిపాదిత ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్స్)లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 678 ఎకరాల్లో విడతలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,276 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఆర్ అండ్ డీ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం సహకరించాలని వారు సీఎంను కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ భౌగోళికంగా దేశం మధ్యలో ఉందని, హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కలిగిన నగరమని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోని ఆరు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సురక్షితమైన, జీవించడానికి అనుకూలమైన కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందిందన్నారు. కార్ల తయారీ పరిశ్రమకు అవసరమైన రవాణా, మౌలిక సదుపాయాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలతోపాటు భవిష్యత్తులో ఓడరేవులకు హైస్పీడ్ కనెక్టివిటీ కల్పించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్ల అభివృద్ధితో వాహన తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. పెరి-అర్బన్ రీజియన్ (ప్యూర్) వంటి ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తయారీ రంగంలో పెట్టుబడులకు అనువైన వేదికగా నిలుస్తుందని సీఎం వివరించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 2024 ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హ్యుందాయ్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. 2025 జూన్‌లో హ్యుందాయ్ ఆరఅండ్డీ కేంద్రం ప్రతిపాదనకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ప్రపంచస్థాయి సౌకర్యాలతో భారీ శాటిలైట్ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సీఎం హ్యుందాయ్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేస్తూ రాబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని సంస్థ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సాంకేతిక, అధునాతన ఇంజినీరింగ్ కేంద్రంగా మరింత బలోపేతం చేయాలన్న హ్యుందాయ్ లక్ష్యం తెలంగాణ రైజింగ్-2047 విజన్‌కు అనుగుణంగా ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో తమ సంస్థ భాగస్వామిగా కొనసాగుతుందన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం
హ్యుందాయ్ సంస్థకు హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. హైటెక్ సిటీలోని కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు మద్దతునిస్తూ కీలక ఆరఅండ్డీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సామర్థ్యాలను మరింత విస్తరించేలా జహీరాబాద్‌లో గ్లోబల్ ఆరఅండ్డీ, మెగా టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా వాహనాల రూపకల్పన, పరీక్షలు, పనితీరు, ధ్రువీకరణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలనతోపాటు ఇంజినీరింగ్ ప్రక్రియలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలగనుంది. హ్యుందాయ్ అధునాతన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





