– కోలిండియా తరహా వేతనాల పెంచుతూ ఉత్తర్వులు
– అధికారుల విజ్ఞప్తిని నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– ఎగ్జిక్యూటివ్ కేడర్-1 నుంచి 7 వరకు సుమారు 1,800 మందికి ప్రయోజనం
– సెప్టెంబర్ 25 నుంచి ఆర్థిక ప్రయోజనాల వర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : సింగరేణి అధికారుల చిరకాల విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నెరవేరింది. కోలిండియా తరహా వేతనాలను అమలు చేస్తూ సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ కేడర్-1 నుంచి ఎగ్జిక్యూటివ్ కేడర్-7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు ప్రయోజనం చేకూరనుంది. సవరించిన బేసిక్ వేతనాలు 2017 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. అయితే, ఆర్థిక ప్రయోజనాలు మాత్రం సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిన ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి వర్తిస్తాయి. ఈ పెరిగిన వేతనాలను అక్టోబరు జీతాల నుంచి చెల్లించనున్నారు. సవరించిన వేతనాల అమలుకు సంబంధించి సంస్థ డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త వేతనాల ప్రకారం అధికారుల బేసిక్ వేతనాలు
కేడర్ పాత బేసిక్ కొత్త బేసిక్ వేతనం
ఇ-1 రూ.40,000 రూ.60,000
ఇ-2 రూ.50,000 రూ.70,000
ఇ-3 రూ.60,000 రూ.80,000
ఇ-4 రూ.70,000 రూ.90,000
ఇ-5 రూ.80,000 రూ.1,00,000
ఇ-6 రూ.90,000 రూ.1,20,000
ఇ-7 రూ.1,00,000 రూ.1,20,000
కోలిండియాలో వేతన అసమానతల నేపథ్యంలో మహారత్న సంస్థల వేతన విధానాన్ని తమకు అమలు చేయాలని కోలిండియా అధికారులు కోరారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోలిండియా యాజమాన్యం ఆమోదం తెలిపాయి. అదే విధానాన్ని సింగరేణిలోనూ అమలు చేయాలని సంస్థ అధికారులు ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన భట్టి విక్రమార్క దసరా లోపు అధికారులకు శుభవార్త అందేలా చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జులైలో సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసి దాని నివేదిక ఆధారంగా బోర్డు ఆమోదంతో వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నది. తమ విజ్ఞప్తిపై ఇచ్చిన హామీని నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు సింగరేణి అధికారుల సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఇంధన అవసరాల కోసం మరింత అంకితభావంతో బొగ్గు ఉత్పత్తి చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతామని స్పష్టం చేశారు.
ఇటీవలే కార్మికులకు రూ.596 కోట్ల బోనస్
ఇటీవలే దసరా సందర్భంగా సింగరేణిలోని దాదాపు 39 వేల మంది కార్మికులకు, ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం తీపి కబురుగా రూ.596 కోట్ల బోనస్ అందించిన విషయం తెలిసిందే. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించి వారికి రూ.5,500 చొప్పున బోనస్‌ను ప్రకటించారు. తాజాగా అధికారులకు వేతన సవరణపై ఉత్తర్వులు వెలువడటం విశేషం.





