Take a fresh look at your lifestyle.

తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాలు

కొరోనా సడలింపులతో ఇంతకాలంగా స్థబ్ధతగా కనిపించిన రాజకీయాలు ఒక్కసారే ఊపునందుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. గడచిన యాభై రోజులుగా కొరోనా మహమ్మారి పరిణామాలకే పరిమితమైన రాజకీయ పార్టీలకు అధికారపార్టీపై విరుచుకు పడేందుకు కావల్సినంత మెటీరియల్‌ ‌లభించింది. కొరోనా నేపద్యంలో క్షీణించిపోయిన దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వివిధ రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలను ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రం కూడా దాన్నిఒక పనికిరాని ప్యాకేజి కింద తీసికట్టింది. ఇదిప్పుడు రాష్ట్రంలో తీవ్రంగా వివాదగ్రస్తమైంది. నాలుగు విడుతలుగా ఈ ప్యాకేజీ తీరుతెన్నులను కేంద్రం వివరించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దానిపై చేసిన కామెంట్‌పై బిజెపి వర్గాలు మండిపడుతున్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్యాకేజీని ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా కెసిఆర్‌ ‌పేర్కొనడం పెద్ద వివాదగ్రస్తంగా మారింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అద్యక్షడు బండి సంజయ్‌లతోపాటు స్థానిక బిజెపి నాయకులు ఒకవైపు, మరోపక్క పక్కరాష్ట్రమైన ఏపి బిజెపి నేతలుకూడా ఈ విషయంలో తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. రాజకీయ లబ్ధికోసమే కేంద్రప్రభుత్వంపై సిఎం కెసిఆర్‌ ‌బురదచల్లుతున్నారంటూ రోజుకో మీడియా సమావేశంతో ఆపార్టీ నేతలు దుమ్మెత్తిపోయడంతో రాజకీయాలు వేడందుకున్నాయి.

ఇదిలాఉంటే పోతిరెడ్డిపాడు విషయాన్ని కాంగ్రెస్‌పార్టీ సీరియస్‌గానే తీసుకుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలని ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వచ్చే నెల జూన్‌ 2‌న ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించడం కూడా మరోవైపు రాజకీయవేడి రాచుకోవడానికి కారణంగా మారింది. దీనికి ముందే గాంథీ భవన్‌లో కాంగ్రెస్‌పార్టీ ఒకరోజు దీక్షను చేపట్టిందికూడా. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచేందుకు ఏపి సర్కార్‌ 203 ‌జీవోను తీసుకొచ్చినా తెలంగాణ సర్కార్‌ ‌నిమ్మకు నీరెత్తినట్లుండడాన్ని కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్‌ ఒకఅడుగు ముందుకేసి దీక్ష చేపట్టేందుకు నిశ్చయించింది. ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడడానికి ప్రధానకారణమే నీళ్ళలో జరుగుతున్న అన్యాయం నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు. ఆ ఆలోచన మేరకే ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఏర్పాటుచేసిందని, దాన్ని కాపాడుకోవాల్సిన అధికారవర్గం నిద్రపోతోందంటూ కాంగ్రెస్‌ ‌తీవ్రంగా దుయ్యబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఏపి ప్రభుత్వం జీవో జారీచేసినా తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇదికేవలం కెసిఆర్‌ ఇం‌టి సమస్యకాదు, రాష్ట్ర రైతుల సమస్య, ప్రజల జీవనానికి సంబంధించిన సమస్య. దీన్ని అంత సులభంగా ఎలా తీసుకుంటారని కాంగ్రెస్‌ ‌ప్రశ్నిస్తోంది. ఒకవైపు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టాన్ని కలిగించే ప్రమాదం ఏర్పడుతున్నదని తాము ముందుగాననే హెచ్చరించినా తీసుకున్న చర్యలేమీ లేకపోగా, ఏపి సిఎంను ఆహ్వానించి, సన్మానించి పంపిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దీనిపై స్పందించకపోవడాన్ని కాంగ్రెస్‌ ‌తీవ్రంగా తప్పుపడుతున్నది. దీనివల్ల నాగార్జునసాగర్‌ ఎం‌డిపోయే ప్రమాదమేర్పడనుంది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఎడారిగా మారిపోనుంది. సికిందరాబాద్‌కు మంచినీటి సమస్య ఏర్పడనుంది. అన్నిటికీ మించి గొప్పదిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీటికన్నా రెండింతలు ఎక్కువ నీటిని తరలించుకుపోయే ప్రమాదం కనిపిస్తున్నది. ప్రాజెక్టుల గురించి, నీళ్ళగురించి అంతా తనకే తెలుసనే కెసిఆర్‌కు ఏపి ప్రభుత్వం జీవో జారీచేసే వరకు ఏమాత్రం ఆలోచనలేకపోవడమే..! పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీటి సామర్ధ్యాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం పెంచిన పక్షంలో దానికి కెసిఆరే బాద్యతవహించాలి . ముఖ్యమంత్రిగా ఉంటే అర్హత ఆయనకుండదని, స్వయంగా తనపదవికి రాజీనామా చేయాల్సిందేనని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎపి ఉత్తమకుమార్‌రెడ్డి హెచ్చరించారు.. గతంలో వైఎస్‌ఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు పోరాటం చేశానని చెబుతున్న కెసిఆర్‌ ‌చేసిందేమీలేదని, వాస్తవంగా అప్పుడు వైఎస్‌ఆర్‌ను వ్యతిరేకించింది మర్రి శశిధర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డిలేనని వారు స్పష్టంచేస్తున్నారు. కాని, నీళ్ళకోసం ఏర్పడిన తెలంగాణలో తన కళ్ళముందే అన్యాయం జరుగుతున్నా కెసిఆర్‌ ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు.

ఇంత గందరగోళం జరుగుతున్నా తాజాగా మీడియా సమావేశంలో కనీసం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించకపోడం దురదృష్టకరం.. ఏపి ముఖ్యమంత్రితో స్నేహబంధం ఉండికూడా తనకు తెలియకుండా జీవో ఎలా విడుదలవుతుందని, దీనివెనుక రహస్యమేదో దాగి ఉందంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లు చేస్తున్న ఆరోపణలు నిజమా అన్న అనుమానం కలుగుతుంది .

Leave a Reply