– మంత్రి కొండా సురేఖ
– పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు
– మంత్రి దామోదర్ రాజనర్సింహ
– పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు
– మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 25: అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఈ క్రమంలో ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.1.44 కోట్లతో నిర్మించిన జిల్లా అటవీ శాఖ కార్యాలయ భవనాన్ని మంత్రులు సురేఖ, దామోదర్ రాజనర్సింహలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో రెండు ఆధునిక ఎకో పార్కులను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి, పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పార్కుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పర్యాటకుల స్పందన ఆధారంగా నైట్ స్టే సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అడవుల సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, రిజర్వ్ ఫారెస్టుల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే నారాయణఖేడ్, జహీరాబాద్‌తోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి దానిని సంరక్షించడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు భద్రమైన భవిష్యత్తు అందించగలమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వన మహోత్సవ కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ప్రకృతి వనాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. బొంతపల్లి వద్ద ఏర్పాటు చేసిన అమృతవనం, హరితవనం వంటి ఎకో పార్కులు ప్రజలకు ప్రకృతి సౌందర్యాన్ని చేరువ చేయడంతోపాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ సంజీవరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, జిల్లా అటవీశాఖ అధికారి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



