నల్ల బ్యాడ్జీలతో సభకు బిఆర్‌ఎస్‌ సభ్యులు

తమ మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని నిరసన
సిఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి ఆందోళన…అరెస్ట్‌ చేసి తరలించిన పోలీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలపై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం వారు అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం ప్రవర్తన తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. వెంటనే తమ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులని.. ఎంతో హుందాగా ప్రజలకు సేవ చేసే గుణం వారిదని తెలిపారు. అలాంటి మహిళా నేతలపై ఇంత చులకనగా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదని.. మొత్తం మహిళలపై వారికున్న చులకన భావాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. కచ్చితంగా మహిళలంతా కాంగ్రెస్‌ నేతల వ్యవహార శైలిని గమనిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. మరోవైపు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నలుపు రంగు కోటు ధరించి సభకు హాజరు కావడంపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు మద్దతుగా నల్ల దుస్తులు ధరించి వొచ్చారని పేర్కొంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

సిఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి ఆందోళన,,,అరెస్ట్‌ చేసి తరలించిన పోలీసులు
బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అవమానకరంగా వ్యాఖ్యలను చేశారని నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం ఛాంబర్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడినుండి తరలించారు. మహిళలను అవమానపరచిన  సీఎం రేవంత్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎంఎల్‌ఏలు డిమాండ్‌ చేశారు. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీలో వెల్‌లో బైఠాయించగా.. మార్షల్‌ వారిని అసెంబ్లీ వెలుపలకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు వాహనంలో అసెంబ్లీ నుంచి తరలించారు.

వారిలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, పద్మారావు గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌ జాదవ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురి సభ్యులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. శాసనసభలో విపక్షం గొంతునొక్కారన్నారు. ఎన్నిసార్లు కోరినా స్పీకర్‌ మైక్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవని, తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు శాసనసభలో చూడడం దురదృష్టకరమన్నారు.

ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్నారు. ముమ్మూటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని..అప్పటి వరకు విడిచిపెట్టేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ కేటీఆర్‌ నినదించారు. మరోవైపు శాసనసభలో మూడుగంటలుగా నిల్చుని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి నిరసన తెలిపారు. సీఎం క్షమాపణలు చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page