– సీఎం ప్రతినిధుల పెట్టుబడుల సమావేశాలకు అనుమతి
– అయినా రాద్ధాంతం తగదు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే సీఎంతోపాటు వెళ్లే అధికారుల ప్రతినిధి బృందానికి పెట్టుబడులు, ఒప్పందాల కోసం సమావేశాలు నిర్వహించుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఆ పర్యటన అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రొటోకాల్, డిప్లొమాటిక్ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆరఏ నిబంధనలు తదితర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. కాగా, గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012లో నాటి అస్సాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలను, అలాగే జార్ఖండ్ నాటి బీజేపీ సీఎం అర్జున్ ముండా థాయిలాండ్ పర్యటనను కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాక నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు కుట్రపూరితంగా లేఖలు రాసిన చరిత్రను గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్రం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, తాజా పర్యటనకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాల లోపాల కారణంగానే నిర్ణయం జరిగిందని, దీనిని రాజకీయం చేయొద్దని ఆయన హెచ్చరించారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజు దోపిడీపై ఆగ్రహం
నీట్ ద్వారా ప్రవేశాలు పొందిన ఎంబీబీఎస్ విద్యార్థుల నుండి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేయడంపై రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ల కోర్సు ఫీజును ఐదు వాయిదాల్లో చెల్లించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫఆర్‌సీ) నిర్దేశించినప్పటికీ కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల పూర్తి ఫీజును వసూలు చేస్తూ ఒక్కో విద్యార్థి కుటుంబంపై రూ.13 లక్షల నుండి రూ.20 లక్షల వరకు అదనపు భారం మోపాయని మండిపడ్డారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే వాపస్ చేయాలని టీఏఎఫఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డితోపాటు హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పులిచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థులకు ఫీజులు రిఫండ్ అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
పార్టీలో చేరిన ప్రముఖ వైద్యులు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, క్యాన్సర్ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడు డాక్టర్ విజయేందర్, ఎల్బీ నగర్ మేఘనా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రమోద్‌లను రామచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కమిటీలను నిర్మించి విశేష సేవలందిస్తున్న డాక్టర్ విజయేందర్ తోటి వైద్యులందరి మద్దతును బీజేపీకి సమీకరిస్తూ పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





