గ్లోబల్ సమ్మిట్ నిర్వ‌హ‌ణ‌కు క‌మిటీలు

– సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. దేశంలోని వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లకు ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని, ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను కూడా సమ్మిట్‌కు ఆహ్వానించాలని సీఎస్ సూచించారు. అలాగే దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, శాస్త్ర-సాంకేతిక, వైద్య, విద్య, మౌలిక వసతులు తదితర రంగాల ప్రముఖులకు సమ్మిట్‌లో పాల్గొనేలా ముందుగానే ఆహ్వానాలు పంపాలని ఆదేశించారు. సమ్మిట్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి కమిటీకి స్పష్టమైన బాధ్యతలను అప్పగించి సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల సామర్థ్యాన్ని, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్‌పో లను ఏర్పాటు చేయాలని, వాటిలో ప్రముఖ కంపెనీలు, సంస్థలు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు మార్గదర్శకత్వం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమ్మిట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించి తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మరింతగా ప్రతిష్ఠించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సమావేశంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణఆదిత్య, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *