కుటుంబ డిజిట్ కార్డులో.. మ‌హిళే య‌జ‌మాని

•ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌ 
*అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న
* ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి 
కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌కు (ఎఫ్‌డీసీ) సంబంధించి రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వ‌ర‌కు రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల్లో ప‌ర్య‌టించిన అధికారులు చేసిన అధ్య‌య‌నంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు, లోపాల‌ను అధికారులు వివ‌రించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ రూపకల్పనపై అధికారుల‌కు ప‌లు ఆదేశాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఉన్న రేష‌న్, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధార‌ణ చేయాల‌ని సూచించారు. ఇత‌ర రాష్ట్రాల కార్డుల రూప‌క‌ల్ప‌న‌, జారీలో ఉన్న మేలైన అంశాల‌ను స్వీక‌రించాల‌ని, లోపాల‌ను ప‌రిహారించాల‌న్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అన‌వ‌స‌ర స‌మాచారం సేక‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *