బండి భగీరథపై అదనపు సెక్షన్లు

– మరింత పకడ్బందీగా కేసు విచారణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై అదనంగా బీఎన్‌ఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్‌ను దర్యాప్తు అధికారులు జత చేశారు. దీని ప్రకారం నేరం రుజువైతే పదేళ్లకు మించి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒక్కోసారి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. ఈ నెల 8న బాధితురాలైన మైనర్‌పై లైంగిక వేధింపులు జరిగాయంటూ ఆమె తల్లి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినప్ప్పుడు పోలీసులు హైడ్రామా మధ్య సెక్షన్ 74, 75 అఫ్ బీఎనఎస్, సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 మేరకు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలి నుంచి మహిళా అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బాధితురాలు నిజం చెప్పకుండా ఒత్తిళ్లు తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం గత సోమవారం కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్‌ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించింది. దర్యాప్తు చేపట్టిన రితిరాజ్ ఆ సాయంత్రం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటన గురించి ఆరా తీశారు. పోలీసులు బాధితురాలి నుంచి తీసుకున్న వాంగూల్మాన్ని పరిశీలించారు. అందులో స్పష్టత లేకపోవడంతో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పోక్సో కేసు దర్యాప్తులో మహిళా అధికారులు ఫ్రెండ్లీ వాతావరణంలో బాధితురాలి నుంచి ఘటనకు సంబంధించిన అంశాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రితిరాజ్ నేరుగా బాధితురాలి ఇంటికి మంగళవారం వెళ్లి ఆమెతో చాలాసేపు మాట్లాడినట్టు తెలిసింది. బాధితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కేసు నమోదు చేసిన సెక్షన్లకు పొంతన లేని విషయాన్ని ఆమె గుర్తించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1), 6 పరిధిలోకి వస్తాయి. బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడి జరిగినట్టు ఆరోపణలుంటే ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చట్టం సూచిస్తున్నది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా జరిగిన నేరం అత్యంత తీవ్రమైనదని గ్రహించిన డీసీపీ ఆ మేరకు కేసులో సెక్షన్లను మార్పు చేయించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ను జోడించారు. సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే నిందితుడికి 20 ఏండ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి.

బండి సంజయ్ రాజీనామా కోరుతూ ఆందోళన
సిరిసిల్లలో బీఆర్‌ఎస్, బీజేపీల ఘర్షణతో ఉద్రిక్తత

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని పాత బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ నేతలపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు గాయపడ్డారు. బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడినప్పటికీ బీఆర్‌ఎస్ నేతలు నిరసనలు ఆపలేదు. సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తలెత్తడంతో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే, డీఎస్పీ నాగేంద్రచారి బీజేపీ నేతలను అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక బీఆర్‌ఎస్ నేతలను సముదాయించి పంపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *