డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటనను ఆపేసుకున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. శనివారం ఉదయం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.
అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఒక్క నాయకుడినైనా గృహనిర్బంధం చేశారా అని ప్రశ్నించారు. జగన్‌ను రావద్దని ఎవరూ నోటీసు ఇవ్వలేదే అని అన్నారు. తిరుమలకు వెళ్లడానికి జగన్‌కు ఇష్టం లేదనీ, డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారనీ అనిత అన్నారు. పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారిందని అనిత విమర్శించారు.