గ్రామాలను బలోపేతం చేయాలి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరవాత పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసాయి. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చి పది నెలలు కావొస్తున్నది. సిఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తున్నా..గట్టిగానే పడుతున్నాయి. అనేక జటిల సమస్యలకు పరిష్కారం చూపేదిశగా పాలన సాగుతోంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రజారంకంగానే ముందుకు సాగుతున్నారని అర్థం చేసుకోవొచ్చు. ఇదే సమయంలో విపక్ష బిఆర్‌ఎస్ కేవలం విమర్శక పాత్రకే పరిమితం అయ్యింది. తమ పదేళ్ల పాలన వైఫల్యాలపై సమాధానం ఇవ్వడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కావొచ్చు..అప్పులు కావొచ్చు.. వ్యవస్థలను భ్రష్టు పట్టంచడం కావొచ్చు.. ధరణిపేరుతో దోపిడీ కావొచ్చు… భూములను చెరపట్టడం కావొచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక సమస్యలపై నిత్యం వొస్తున్న విమర్శలను పట్టించుకోకుండా అతితెలివితో ఎదురుదాడి విమర్వలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మరో ఎన్నికల సమరానికి తెరలేవనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. సర్పంచ్, మండలాలు, జడ్పీల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఈ ఎన్నికలు కూడా అధికార కాంగ్రెస్‌కు, విపక్ష బిజెపి, బిఆర్‌ఎస్‌లకు కీలకం కానున్నాయి. కిందిస్థాయిలో పట్టు సాధించాలంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పాలనాతీరులో మార్పు రావాల్సి ఉంది. మూస పాలనకు, తాయిలాలకు దూరంగా ఉండాలి. గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా కార్యక్రమాలు ఉండాలి. కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామంటున్న ప్రభుత్వం..ఉన్న రేషన్ కార్డుల్లో నకిలీవెన్ని అన్న గుర్తింపు చేయాలి. రేషన్ కార్డుల ఏరివేత తరవాతనే కొత్త రేషన్ కార్డులు చేపట్టాలి. అలాగే బియ్యం ధరలు మండిపోతున్న వేళ..కిలో రూపాయి బియ్యం పథకాన్ని సమీ క్షించాలి. రూపాయికి కొత్తిమీర కూడా రాని ఈ రోజుల్లో ఇంకా ఈ పథకాలన్ని కొనసాగించడం సరికాదు. ఇకపోతే గ్రామీణ అర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న గ్రామాలను అభివృద్ధి పరచి, సర్పంచ్‌లను బాధ్యులను చేసేలా కార్యక్రమాల రచన జరగడం లేదు.
గ్రామస్థాయి నుంచి ప్రణాళిక సాగివుంటే గ్రామాలు బాగుపడి రాష్ట్రం, దేశం బగుపడేది. కానీ అలాంటి ఆలోచన కార్యరూపం దాల్చడం లేదు. గ్రామాలను బలోపేతం చేస్తే పట్టణాలకు వలసలు తగ్గుతాయి. పట్టణాలపై భారం పడదు. గ్రామాల్లో విద్య,వైద్యం, సాగు,తాగునీ టి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలి. అన్నీ సచివాలయం నుంచి సిఎంల పర్యవేక్షణలో జరగడం వల్ల గ్రామాలు వట్టిపోవడా నికి కారణం అవుతున్నాయి. గ్రామస్థాయిలో ప్రణాళికలు రచించి అమలయ్యేలా కార్యాచరణ సాగేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. ఆర్థికంగా పంచాయితీలు బలోపేతంగా లేకపోవడంతో పాటు, సర్పంచ్‌లు కూడా బాధ్యతా రహితంగా వ్యవహరించడంవల్ల ఇంతకాలం గ్రామాల్లో పక్కాగా ప్రణాళికలు జరగలేదు. కేంద్రం నేరుగా నిధులు ఇస్తోంది. అయినా వాటిని పక్కదారి పట్టించారు.
వివిధ పథకాలతో సర్పంచ్‌లకు బాధ్యత లేకుండా చేస్తున్నపెత్తనాన్ని తగ్గించుకుని, స్థానిక సంస్థలకు రాజీవ్ హయాంలో ఇచ్చి సవరణల ప్రకారం అధికారాలను బదిలీ చేయాలి. సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేయడం సరికాదు. ఎపిలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామా సర్పంచ్ వ్యవస్థను గత జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. సర్పంచ్‌లకు బాధ్యతలు లేకుండా చేయడం సరికాదు. ఎపిలో ఆర్బీకెలతో పెత్తనం సాగించారు. ఎన్నికైన సర్పంచ్‌లను డవ్మిరీలుగా చేస్తూ..వారికి నిధులు కేటాయించ కుండా..వారిని పనిచేయనీయకుండా పెత్తనం చెలాయించడంతో గ్రామాలు సమగ్ర అభివృద్దికి నోచుకోలేదు. గ్రామాలకు ఏమి అవసరమన్నది గుర్తించి నిధులు విడుదలచేసి, అమలు చేయించేలా కార్యాక్రమాలు సాగివుంటే ఆర్థికవ్యవస్థ ఎప్పుడో బలోపేతం అయ్యేది. గ్రామాల్లో సర్పంచ్‌లు పటిష్టంగా పనిచేయడంతో పాటు ప్రణాళికలు సిద్దం చేసేలా అధికారులు కార్యాచరణ సిద్దం చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. గ్రామాలను పటిష్ట పాలనా కేంద్రలుగా తీర్చి దిద్దాలి. గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ఉద్యోగులను పనిచేసేలా చేయాలి.
అలాగే పనులకు సంబంధించి గ్రామాల్లో తీర్మానం చేయించి అమలు చేయించాలి. సిఎం స్థాయిలో కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉండాలి. కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగేలా అవసరమైతే ప్రణాళికలను అమలు చేయాలి. అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. గ్రామాలను యూనిట్‌గా కార్యక్రమాల రచన సాగాలి. ప్రతి పనికీ సర్పంచ్‌లను, గ్రామ వార్డు సభ్యులను బాధ్యులను చేయాలి. అప్పుడే ఏ పథకం అయినా ఆశించన ఫలితం సాధిస్తుంది. అలాగే ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పారిశుధ్య కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా పారిశుధ్యం అన్నది పంచాయితీల సామాజిక బాధ్యతగా చేయాలి. స్వచ్ఛత అన్నది వ్యక్తిగతమైన శ్రద్దకు సంబంధించి నదే అయినా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇలాంటి శ్రద్ద తక్కువనే చెప్పాలి. ఇప్పటికీ ఆరుబయట మల విసర్జన అన్నది అలవాటుగా కొనసాగుతోంది. నిత్యం టీవీల్లో పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజల్లో చ్కెతన్యానికి కృషి చేస్తున్నా వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. అనారోగ్యాల బారిన పడుతున్నా ప్రజలు ఇందుకు కారణాలు అపరిశుభ్రత అని గ్రహించడం లేదు.
చెత్తను వీదుల్లో పడేయడం, కాలువల్లో పడేయడం ద్వారా గ్రామాల్లో పారిశుద్ద్యంపై బాధ్యత లేకుండా పోయింది. చెత్త ఎత్తేయడం అధికారుల పని అన్న భావనలో ప్రజలు ఉన్నారు. పారిశుద్దయం, పచ్చదనం, పర్యావరణపై గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగాలి. చ్కెతన్యం చేయాలి. గ్రామస్థాయిలో పనులకు సర్పంచ్‌లను బాధ్యులను చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఏ గ్రామానికి ఆగ్రామ సర్పంచ్‌ను బాధ్యుడిని చేస్తే సరిపోయేది. పారిశుద్యం, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలు సామాజిక బాధ్యత కావాలి. ఈ రకమైన చ్కెతన్యం కోసం ఉద్యమించాల్సి ఉంది. పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది.
ప్రధానంగా అన్ని పనులను ప్రభుత్వంమే చేస్తుందన్న ధీమాలో ప్రజలు ఉన్నారు. పరిశుభ్రత లోపించిన కారణంగానే వ్యక్తిగతంగానే గాక పరిసరాల శుభ్రతా లోపించి అతిసారం, కలరా వంటి వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయి. మురికివాడల వద్ద ఖాళీ ప్రదేశాలు, పొలం ప్రాంతాలు, గ్రామాల శివారు స్థలాలు, రైలు పట్టాల పరిసరాల్లో కాలకృత్యాలు హానికరంగా పరిణమిస్తున్నాయి. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వేలాది రూపాయల వేతనాలుగా అందిస్తున్నారు. అయినా మార్పులు కానరావడం లేదు. ఓటుబ్యాంక్ రాజకీయాల కారణంగా ప్రజలు అచేతనంగా తయారయ్యారు. వారిని బాధ్యులను చేసేలా చర్యలు ఉండడం లేదు. అన్నీ ప్రబుత్వం చేస్తుందన్న భావన నుంచి ప్రజలను బయటపడేయాలి. సర్పంచ్‌లను, పంచాయితీల పాలకవర్గాలను విశ్వాసంలోకి తీసుకుని వారిని బాధ్యులను చేసినప్పుడే గ్రామాల రూపురేఖలు మారగలవు. ఆర్థికంగా బలోపేతం కాగలవు.
-సమీర్