“2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి చొప్పున ఆత్మహత్యకి పాల్పడనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చెప్తున్నాయి. అంటే రోజుకు సగటున 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్సీఆర్బీ వారి ‘యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా 2021’ నివేదిక ప్రకారం 2020లో నమోదైన 12,526 మరణాలతో పోలిస్తే ఇది 4.5 శాతం అధికం. ఇందులో 864 ఆత్మహత్యలకు “పరీక్షలలో ఫెయిల్” కావడం అనేది ప్రధాన కారణం.”
భారతదేశంలోని 140 కోట్ల జనాభాలో 50 శాతానికి పైగా 25 ఏళ్లలోపు యువజనమే ఉన్నారు. ఈ యువశక్తే మన దేశ ప్రయోజనంలో కీలకాంశమని భావిస్తారు. కానీ ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే ఇటీవలి సంవత్సరాలలో యువత ఆత్మహత్యలు బాగా పెరుగుతున్నాయి. 2025 మార్చిలో ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఆత్మహత్యల కారణంగా ప్రతి ఏటా 7,20,000 మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆత్మహత్యలలో 73 శాతం పేద- అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే జరుగుతున్నాయి. అలాగే 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులలో మరణానికి ఆత్మహత్య అనేది మూడవ ప్రధాన కారణమని ఆ నివేదిక సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశంలో సగటు ఆత్మహత్యల రేటు ప్రతి లక్ష జనాభాకు 10.9గా ఉంది. మరో విషాదం ఏమిటంటే అత్యధిక యువత ఆత్మహత్యల రేటు మనదేశంలోనే నమోదవుతోంది. ఆత్మహత్యలకు కారణాలు బహుముఖమైనవి.. సామాజిక, సాంస్కృతిక, జీవసంబంధ, మానసిక, పర్యావరణం వంటి విషయాలు వీటిని ప్రభావితం చేస్తుంటాయి.
2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి చొప్పున ఆత్మహత్యకి పాల్పడనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చెప్తున్నాయి. అంటే రోజుకు సగటున 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్సీఆర్బీ వారి ‘యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా 2021’ నివేదిక ప్రకారం 2020లో నమోదైన 12,526 మరణాలతో పోలిస్తే ఇది 4.5 శాతం అధికం. ఇందులో 864 ఆత్మహత్యలకు “పరీక్షలలో ఫెయిల్” కావడం అనేది ప్రధాన కారణం.
యువత ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు:
నీట్ అభ్యర్థి అనుమానాస్పద మరణంపై జరుపుతున్న విచారణ సందర్భంగా 2025 జూలై 25న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విద్యకి సంబంధించిన ఆదర్శాలు, ఉద్దేశాలపై తత్వవేత్తలయిన రూసో, జిడ్డు కృష్ణమూర్తిలను ఉటంకిస్తూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సభ్యసమాజం తో పాటు యువ విద్యార్థుల మనస్సులను అతలాకుతలం చేస్తున్న ఒత్తిడి, మానసిక క్షోభ గురించి ఈ తీర్పు హృద్యంగా చర్చించింది. ఈ పరిణామం యువతకి తమ జీవితాలపై ఆశని కోల్పోయేలా చేస్తోందని పేర్కొన్నది. తీర్పు పరిచయ భాగంలోని ఆరు, ఏడవ అంశాల్లో కోర్టు ఇలా ఉటంకించింది: “విద్య అనేది రానురాను తీవ్రమైన పోటీగా, విజయం, హోదా, ఆర్థిక భద్రత వంటి సంకుచిత లక్ష్యాల వైపు నడిపించే ఒత్తిడితో కూడిన మార్గంగా మారుతోంది. అభ్యాసంలో ఉండే ఆనందం స్థానంలో ర్యాంకులు, ఫలితాలు, అంతులేని పనిభారం అనే కొలమానాలతో ఆందోళన చోటుచేసుకుంది. యువ విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తరచుగా ఒక వలయంలో చిక్కుకుపోతున్నారు. అందులో ఉత్సుకత కంటే అనుగుణ్యతకి, అవగాహన కంటే ఫలితానికి, శ్రేయస్సు కంటే ఓర్పుకు పెద్దపీట ఉంటుంది. ఈ నమూనా ప్రకారం జీవితం పరీక్షల పరంపరగా తయారవుతుంది. ఇక్కడ విఫలమైతే అది ఎదుగుదలలో ఒక అంశంగా కాకుండా ఒక నిరాశలోకి కుంగదీసే ముగింపుగా మారుతోంది. పనితీరు ప్రమాణాలు, సంస్థాగత కఠినత్వంతో నడిచే ఈ వ్యవస్థలో ముఖ్యంగా తీవ్రమైన పోటీ పరీక్షల వాతావరణంలో విద్యార్థులు తరచుగా ప్రమాదకరమైన మానసిక ఒత్తిడికి గురవుతారు.”
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ఇచ్చిన ఈ తీర్పులో పాఠశాలలు, కళాశాలలు సహా కోచింగ్ సెంటర్లలోని విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తప్పక పాటించవలసిన పదిహేను మార్గదర్శకాలను నిర్దేశించారు. యువ విద్యార్థుల దృఢమైన మానసిక ఆరోగ్యం కోసం అవసరమైన సహాయక చర్యలను అందించాల్సిన ఆవశ్యకతను ఈ తీర్పు గుర్తించింది; ఇలాంటి చర్యలు మృగ్యం కావడంతో తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణకు గురవుతున్న వారు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడుతోంది.
“ఈ మధ్యకాలంలో నీట్/ జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడటంతో కోటా అపఖ్యాతి పాలైంది. తీవ్రమైన పరీక్షల ఒత్తిడి, ఇంటికి దూరంగా ఉండటం వల్ల కలిగే ఒంటరితనం వంటివి ఈ విషాదాలకు తరచూ కారణమవుతున్నాయి. 2022 లో కోటాలో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016 లో 17 మంది, 2015లో 18 మంది పోటీ పరీక్షల అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు..”
ఆత్మహత్యలు- సైద్ధాంతిక కోణాలు:
డా- కంచర్ల వాలెంటినా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, దిల్లీ
ఆత్మహత్యలను అర్థం చేసుకోవడానికి ఫ్రెంచ్ సామాజికవేత్త ఎమిలే డర్కీమ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఆత్మహత్యలను నాలుగు విస్తృత రకాలుగా డర్కీమ్ గుర్తించారు, అవి: 1. అహంకారపూరితం. 2. పరోపకార ధోరణి. 3. నిస్సహాయత 4. విధిరాత అనుకోవడం. ఈ నాలుగు రకాలను, వాటికి దారితీసే కారణాలను సామాజిక అనుసంధానం, సామాజిక నియంత్రణ అనే రెండు విడి అస్తిత్వాలలో మారుతున్న విలువల ఆధారంగా వివరిస్తారు. ఆయన సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తికి ఇతరులతో సంబంధాలు దెబ్బతిని, తగినంత సామాజిక మద్దతు కొరవడినప్పుడు అహంతో కూడిన ఆత్మహత్య సంభవిస్తుంది.
డర్కీమ్ ప్రకారం “సమాజ భారం వ్యక్తులపై పడినప్పుడు” పరోపకార ఆత్మాహుతి జరుగుతుంది. సామాజిక నియంత్రణ సన్నగిల్లినప్పుడు లేదా దానికి అంతరాయం కలిగినప్పుడు “నిస్సహాయ ఆత్మహత్య”కి దారితీయవచ్చు. అలాగే, మితిమీరిన సామాజిక నియంత్రణ వల్ల మానసిక ఒత్తిడి తీవ్రమై “నా విధిరాత ఇంతే” అన్న నిరాశతో ఆత్మహత్యకి పాల్పడేవారు ఉంటారు. క్రమశిక్షణతో కూడిన తీవ్ర ఒత్తిడి, సామాజిక పరిస్థితుల కారణంగా భవిష్యత్తు అంధకారంగా, ఆశలు, అభిరుచులు అడుగంటిన సందర్భాలలో ఇటువంటి ఆత్మహత్యలు చోటుచేసుకుంటాయి.
యువతలో ఆత్మహత్యలు:
ఆత్మహత్యలు చేసుకోవడానికి, మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా జరుగుతున్న మహిళల ఆత్మహత్యలలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. పురుషుల ఆత్మహత్యల విషయంలో దాదాపు 4వ స్థానంలో ఉంది. బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) బృందం 12 రాష్ట్రాల్లోని 34,802 మందిపై జరిపిన ఒక అధ్యయనంలో (2015 – 2016) ఆసక్తికరమైన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిమ్హాన్స్ అధ్యయనం ప్రకారం జనాభాలో సుమారు 10 శాతం మంది సాధారణ మానసిక సమస్యలతోను, 1.9శాతం మంది తీవ్రమైన మానసిక సమస్యలతోను బాధపడుతున్నారు. స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్, దిగులు, ఆందోళన, సైకోసిస్, భయం, ఆత్మహత్యకి పురికొల్పే ఆలోచనలు, మానసిక స్థితి సరిలేకపోవడం, హైపోకాండ్రియాక్ లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు, తీవ్ర ఒత్తిడి ఫలితం తలెత్తే విపరిణామాలు, కుటుంబ తగాదాలు, నిద్రలేమి, మద్యపాన వ్యసనం, మాదకద్రవ్యాలకి బానిస కావడం, చిత్తవైకల్యం వంటివి అందరిలోను సాధారణ సమస్యలుగా మారుతున్నాయి.
నీట్/ జేఈఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల గురించి జరిపిన కొన్ని అధ్యయనాల్లో ఈ ప్రవేశ పరీక్షల ఒత్తిడి యువ విద్యార్థులలో ఆందోళనను, మానసిక క్షోభను కలిగిస్తోందని, ఫలితంగా వారు ఆత్మహత్య వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నారని తేటతెల్లమైంది. ఇలా మరణించిన వారిలో 65 శాతం మంది అమ్మాయిలే ఉండటం గమనార్హం. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న వారిలో మహిళా అభ్యర్థుల ప్రాతినిధ్యం అధికంగా ఉండటం కూడా దీనికొక కారణం కావచ్చు. దీనికి తోడు ఒత్తిడిని తట్టుకునే సామర్ధ్యంలో తేడాలు ప్రభావితం చేయవచ్చు. అమ్మాయిల విషయంలో ఇవి స్పష్టమయ్యాయి.
“ఆత్మహత్యలకు గల కారణాలు బహుముఖమైనవి. సామాజిక, సాంస్కృతిక, జీవసంబంధ, మానసిక, పర్యావరణం వంటి అంశాల ద్వారా ప్రభావితమయ్యే సమస్య ఇది. ఈ తరహా ఆత్మహత్యలకు ముందు ఆయా వ్యక్తులలో కనిపించే మానసిక కుంగుబాటు సంకేతాలను మనం గుర్తించాలి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రవేశాలు పొందడం కంటే కూడా గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కే ముఖ్యమని మన పిల్లలకు అర్థం చేయించాలి. ఇందుకోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, మీడియా, పౌర సమాజ సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాలి. పరీక్ష తప్పుతామనే భయం, విజయం సాధించాలనే ఒత్తిడి అనేవి ఆత్మహత్యలకు దోహదపడే రెండు ప్రధాన ప్రేరణలు..”
చాలా మంది విద్యార్థుల పనితీరుని గమనిస్తే వారు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, తమ తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోవడం, పరీక్ష తప్పుతామన్న భయం, విఫలమైతే ఏం జరుగుతుందీ అన్న విషయాలపై ఆలోచనలతో ఉంటున్నారని తేలింది. కోచింగ్ హబ్బులుగా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ లోని కోట, కేరళంలోని త్రిస్సూర్, తమిళనాడులోని చెన్నై వంటి క్లస్టర్లలో చేపట్టిన అధ్యాయనాల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి. నీట్ పరీక్షకు సిద్ధం కావడానికి విద్యార్థులు ఎక్కువగా ఈ ప్రాంతాలకే వెళతారు.
ఈ మధ్యకాలంలో నీట్/ జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడటంతో కోటా అపఖ్యాతి పాలైంది. తీవ్రమైన పరీక్షల ఒత్తిడి, ఇంటికి దూరంగా ఉండటం వల్ల కలిగే ఒంటరితనం వంటివి ఈ విషాదాలకు తరచూ కారణమవుతున్నాయి. 2022 లో కోటాలో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016 లో 17 మంది, 2015లో 18 మంది పోటీ పరీక్షల అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2025 మేలో పీటీఐ కథనం ప్రకారం ఈ ఏడాది నీట్ పరీక్షకు ముందు కోటాలోని పార్శ్వనాథ్ ప్రాంతంలో ఒక నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణ వచ్చింది. ఈ నగరంలో ఇప్పటివరకు మొత్తం 14 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2024 లో ఈ సంఖ్య 17కి చేరగా, 2023లో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 26 కి చేరాయి. చాలా మంది విద్యార్థులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో ఈ తరహా మరణాలను నివారించడానికి కోటాలోని అనేక హాస్టళ్లు ఫ్యాన్లకు స్ప్రింగులను అమర్చాయి.
అంతకంతకూ పెరుగుతున్న పోటీ, తల్లిదండ్రుల అంచనాల ఒత్తిడి, ఆయా కోచింగ్/ విద్యాసంస్థల నుంచి సరైన మానసిక-సామాజిక మద్దతు లభించకపోవడం, సందర్భశుద్ది కలిగిన మార్గదర్శకత్వం కొరవడటం, త్వరత్వరగా సమీపించే గడువులు, నిద్రలేమి, శరీరానికి, మనస్సుకి ఉపశమనంగా కలిగించే లేదా వినోద కార్యకలాపాలలో పాల్గొనడానికి విరామం లేకపోవడం వంటివి ఆత్మహత్యలను ప్రేరేపించే కొన్ని కారణాలు. ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక (2022) ప్రకారం అత్యధిక శాతం మరణాలు సెకండరీ స్థాయి విద్య కలిగినవారిలో సంభవించాయి. మొత్తం ఆత్మహత్యలలో ఇది 23.9 శాతంగా ఉంది. కొన్ని పరీక్షల సమయంలోను, ఫలితాలు వెలువడిన సమయంలోను ఆత్మహత్యలు పెరుగుతాయి. మన సమాజంలో పరీక్షలలో తప్పితే సర్వస్వం పోగొట్టుకున్నట్లుగా భావించే పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి సామర్థ్యానికి వారు సాధించే మంచి మార్కులే కొలమానం అని, వారు విఫలమైనా లేదా మంచి మార్కులు సాధించకపోయినా అసమర్ధులని భావించే తప్పుడు అభిప్రాయమే దీనికి కారణం. కోచింగ్ సెంటర్లు టాపర్లను కీర్తిస్తూ భారీ ఎత్తున జరిపే ఆర్భాటపు వేడుకలు కూడా యువత మనస్సులలో విజయం పై తప్పుడు భావనని ఏర్పరుస్తున్నాయి.
నీట్/ జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షలలో తీవ్రమైన పోటీ ఉంటుంది కనుక విద్యార్థులను మానసికంగా సంసిద్ధం చేయడానికి, వారికి ఆయా సంస్థల నుండి సలహాలు, మద్దతు చాలా అరుదుగా లభిస్తాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే నీట్-యూజీ పరీక్ష భారతదేశంలోనే అత్యంత కఠినతర పోటీ పరీక్షలలో ఒకటి. ఇందులో ఏటా 20 లక్షలకు పైగా విద్యార్థులు పరిమిత వైద్య సీట్ల కోసం పోటీ పడతారు. నీట్-యూజీలో దాదాపు లక్ష సీట్లు ఉంటే, ఇందులో దాదాపు సగం ప్రభుత్వ కోటాకు చెందినవే. మన దేశంలోని ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజుల కారణంగా ఎంబీబీఎస్ చదవడం భారంతో కూడిన పని. అందువల్ల కొంతమంది విద్యార్థులు చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలలో చదువుకోవడానికి ఇష్టపడతారు.
ఒక అంచనా ప్రకారం 2024 నాటికి భారతదేశంలో సుమారు 386 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఏటా 55,880కి పైగా ఎంబీబీఎస్ సీట్లు వీటిలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ పరీక్షలతో కూడిన జేఈఈ పరీక్షలకు దాదాపు 10 నుంచి 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. జేఈఈ మెయిన్స్ 2025 కోసం మొత్తం 13,11,544 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 12,58,136 మంది అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2 రెండింటికీ హాజరయ్యారు. ఫలితంగా హాజరు శాతం 95.93 శాతంగా నమోదైంది. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులలో కేవలం 2.5 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందుతారు. ఆ తర్వాత వారు ఐఐటీ ల లోని దాదాపు 10,988 సీట్ల కోసం, నిట్ లలోని 18,000 సీట్ల కోసం పోటీపడతారు. ఇంజనీరింగ్ సీట్ల కోసం కూడా పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ఇది తేటతెల్లం చేస్తుంది. ఈ కోర్సులలో ప్రవేశం పొందడానికి ఎంతో కష్టపడిన తర్వాత కూడా చాలామంది విద్యార్థులకు, ముఖ్యంగా అణగారిన వర్గాల పిల్లలకు కష్టాలు తీరడం లేదు.
విద్యా మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2014 నుండి 2021 మధ్య ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర సంస్థలకు చెందిన 122 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, గ్లోబల్ ఐఐటీ అలూమ్నీ సపోర్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడైన ధీరజ్ సింగ్ దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) పత్రం ద్వారా వెల్లడైన అంశం ఏమిటంటే 2005 నుండి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన కనీసం 115 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో 98 మరణాలు క్యాంపస్ లో జరగ్గా, వాటిలో 56 ఉరి వేసుకోవడం ద్వారా సంభవించాయి. 17 మరణాలు క్యాంపస్ వెలుపల జరిగాయి. 2005- 2024 మధ్య ఐఐటీ మద్రాస్ లో అత్యధికంగా 26 మరణాలు నమోదు కాగా, ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్ లో 18, ఐఐటీ ఖరగ్‌పూర్ లో 13 ఐఐటీ బొంబాయిలో 10 మరణాలు నమోదయ్యాయి.
జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమం:
భారత ప్రభుత్వం 2022 అక్టోబర్ 10న జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమం (NTMHP) ప్రారంభించింది. దేశ మానసిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు రెండేళ్ళుగా ఈ సంస్థ గణనీయమైన సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా టెలి మానస్ (రాష్ట్రాల వారీగా టెలి మానసిక ఆరోగ్య సహాయం, నెట్వర్కింగ్) కోసం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ (14416) అందుబాటులోకి తెచ్చారు. ఇది విస్తృత రీతిలో మానసిక ఆరోగ్య సేవలను అందిస్తుంది. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా దూరాభారం, ఆర్ధిక పరమైన ఖర్చులు లేకుండానే వ్యక్తులు టెలిఫోన్ ఆధారిత కౌన్సెలింగ్, సైకోథెరపీ, మానసిక వైద్య సంప్రదింపులు, అత్యవసర సంరక్షణతో సహా రెఫరల్ సేవలను పొందవచ్చును. 2023 డిసెంబర్ 4వ తేదీ నాటికి 34 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 46 టెలి మానస్ కౌంటర్లను ఏర్పాటుచేసి మానసిక ఆరోగ్య సేవలను ప్రారంభించాయి. 5,00,000 కంటే ఎక్కువ కాల్స్ ను హెల్ప్ లైన్ స్వీకరించింది. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఆత్మహత్య నివారణ కోసం నిరంతర కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నాయి.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే చేపట్టే చర్యల మాదిరిగానే మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను సైతం బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఇదిలా ఉంటే, భారత ప్రభుత్వం 2025–26 కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య సంరక్షణ నిధుల మొత్తం పెంచింది కానీ అందులో మానసిక ఆరోగ్యానికి కేటాయింపు మాత్రం చాలా తక్కువగా ఉంది. మొత్తం హెల్త్ బడ్జెట్ లో కేవలం 1.05శాతం మాత్రమే మానసిక ఆరోగ్యానికి కేటాయించారు. పేలవమైన ఈ మద్దతును గమనిస్తే మానసిక ఆరోగ్య సేవలను దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో ముఖ్యమైన భాగంగా పరిగణించే విషయంలో రాజకీయ సంకల్పం కొరవడిందని స్పష్టమవుతోంది.
మన దేశంలో ప్రస్తుతం సమర్ధత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణులు, సేవల కొరత ఉంది. ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం 0.3 మంది సైకియాట్రిస్టులు, 0.07 మంది సైకాలజిస్టులు, 0.07 మంది సామాజిక కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాలలో అయితే ప్రతి లక్ష జనాభాకు 6.6 మంది సైకియాట్రిస్టులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి లక్ష జనాభాకు 0.04 మానసిక హాస్పిటల్స్ ఉండగా, భారతదేశంలో ఈ సంఖ్య కేవలం 0.004 మాత్రమే. మానసిక రుగ్మతలతో ముడిపడి ఉన్న సామాజిక లోటుని అధిగమించాలంటే మానసిక ఆరోగ్య నిపుణుల సంఖ్యను పెంచడం ద్వారా సమర్థవంతమైన చికిత్స అందించడం ఒక్కటే మార్గం. ఆత్మహత్య మరణాలను ఒక ప్రజారోగ్య సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది.
ముందే చెప్పినట్టు.. ఆత్మహత్యలకు గల కారణాలు బహుముఖమైనవి. సామాజిక, సాంస్కృతిక, జీవసంబంధ, మానసిక, పర్యావరణం వంటి అంశాల ద్వారా ప్రభావితమయ్యే సమస్య ఇది. ఈ తరహా ఆత్మహత్యలకు ముందు ఆయా వ్యక్తులలో కనిపించే మానసిక కుంగుబాటు సంకేతాలను మనం గుర్తించాలి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రవేశాలు పొందడం కంటే కూడా గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కే ముఖ్యమని మన పిల్లలకు అర్థం చేయించాలి. ఇందుకోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, మీడియా, పౌర సమాజ సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాలి. పరీక్ష తప్పుతామనే భయం, విజయం సాధించాలనే ఒత్తిడి అనేవి ఆత్మహత్యలకు దోహదపడే రెండు ప్రధాన ప్రేరణలు కాబట్టి, సభ్యసమాజంగా మనందరం అటువంటి మానసిక క్షోభను అధిగమించేలా వారికి అవసరమైన మద్దతును అందించాలని కంకణం కట్టుకుందాం.