- పొంగులేటికి బాంబుల మంత్రిత్వ శాఖ ఇవ్వాలి
- హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హనుమకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 10 : బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం కేటీఆర్ హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులగణన చేపడుతామంటున్న కాంగ్రెస్ నాయకులను బీసీలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. ఉన్న పథకాలకే పారవేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీలను మరోసారి మోసం చేసేందుకే కొత్త నాటకం ఆడుతోందన్నారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఒక సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదని, బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వొచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్, బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ కుల గణన చేయాల్సిందేనని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వంపై నమ్మకం లేకనే కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ఇచ్చిన హామీలను రేవంత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఇంటికి వొచ్చిన ప్రభుత్వాధికారులను ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుందని, ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. 60 ఏళ్ల పాటు బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని, 60 ఏళ్లలో కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని దరిద్రపు చరిత్ర కాంగ్రెస్ కు ఉందని, నేడు ఆ పార్టీ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మబోరని అన్నారు. కాగా ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో ఆటం బాంబులు పేలుతాయని చెప్పిన విషయమై ప్రశ్నించగా ఏ బాంబులు పేల్చుతాడో చూస్తామని, పొంగులేటికి ఆటం బాంబుల మంత్రిత్వ శాఖ అప్పగించాలని ఎద్దేవా చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో శాసనమండలి బీఆర్ఎస్ సభా పక్ష నాయకులు సిరికొండ మధుసూదనా చారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు,ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.