– మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు
– ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలో టీజేఎస్ పాల్గొనని ప్రజా పోరాటాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే కాంగ్రెస్‌కు మద్దతిచ్చామన్నారు. మంత్రులం, ఎమ్మెల్యేలం కావాలని మాకు లేదు.. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ చెప్పలేదు.. నేను అడగలేదు. అవసరమైనప్పుడు ప్రజలకు తోడుగా ఉన్నాం.. మే 12న జరిగే ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ‘తాము ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని అడుగుతున్నాం.. ఈసారి తమ పార్టీ నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరినైనా కలవాలంటే భయపడే పరిస్థితి ఉండేదని, ఇంట్లోనే ఫోన్ పెట్టి జాగ్రత్తగా రమ్మని చెప్పేవాళ్లు అని, భయం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించింది అని విమర్శించారు. అమరుల స్ఫూర్తి యాత్రకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని కోదండరాం గుర్తు చేశారు. ప్రజలకు దూరంగా ఉంటే ఏ పార్టీ అయినా బతకదని, అందుకే కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని అన్నారు. ’మేం సరిగ్గానే ఉన్నాం.. ప్రజలే మారాలి అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కుటుంబ లోపాలను కవిత బయటపెడుతున్నారన్నారు. పార్టీ అంటే కుటుంబమే అని కవిత చెప్పకుండానే చెబుతున్నారన్నారు. ఓట్లు, సీట్లు కావాలంటే పార్టీని వేరేలా నడపాలని, తాము మార్పు కోసమే పార్టీని నడుపుతున్నామని స్పష్టం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఉండలేమని, ఈసారి కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ముందు నుంచే నియోజకవర్గాలను ఎంచుకుని పనిచేస్తామన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నట్లు కోదండరాం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


