తెలంగాణ గ‌ర్వించద‌గిన క‌ళాకారుడు జ‌య‌రాజ్‌

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌
  • జ‌య‌రాజ్ జీవిత‌చ‌రిత్ర‌పై పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన సీఎం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 28 : తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత పైడి జయరాజ్ అని, స్వాతంత్య్రానికి పూర్వమే ముంబైకి వెళ్లి అక్కడ బాలీవుడ్ లో తనదైన ప్రతిభతో ప్రత్యేక ముద్ర వేసి గొప్ప హీరోగా వెలుగొందాడని సీఎం రేవంత్ కొనియాడారు.

కరీంనగర్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వ్యాయామశాలలో శిక్షణ పొంది, జాతీయ చలనచిత్ర సీమను కొన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిన గొప్ప నటుడు పైడి జ‌య‌రాజ్ అని, సినిమాలలో నటించాలనే తన కలను సాధించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని గెలిచార‌ని ఆయ‌న జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌శంసించారు.

ఆయన స్ఫూర్తితో తెలంగాణలో సినీరంగంలో ఎదుగుదామనుకునే నవ యువ దర్శకులు, నటులు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. కాగా , పైడి జయరాజ్ 115వ జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్, నంది పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర, పైడి జయరాజ్ జీవితంపై రాసిన “ద ఫస్ట్ యాక్షన్ హీరో అనే పుస్తకాన్ని సచివాలయంలో శ‌నివ‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర పైడి జయరాజ్ 1980 లోనే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందారని, దాదాపు 130కి పైగా సినిమాల్లో హీరోగా నటించారని, మూకీ సినిమాల కాలంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి ముంబైకి వెళ్లి ఆనాటి పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్, అశోక్ కుమార్ వంటి గొప్ప నటుల సరసన తనదైన ముద్రను వేసి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగుర వేశార‌ని వివరించారు.

ఆయన జీవిత చరిత్రని పుస్తకం గానే కాకుండా, డాక్యుమెంటరీగా కూడా తీశామని, దీని కోసం వందలాది ఫోటోగ్రాఫ్ లను జయ‌రాజ్ వారసుల నుంచి సేకరించి ఈ గ్రంథ రచన చేశామని వివరించారు. ఆయన పేరిట తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని వినతి పత్రం అందించారు. ఈ పుస్తకావిష్కరణలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తిరుపతి త‌దితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page