– మాక్ పార్లమెంట్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30ః కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమే పనిగా పెట్టుకుందని, ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను ‘మాక్ పార్లమెంట్’ పేరిట హేళన చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యక్షులు బండారు శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఓ.ఎస్. రెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010లో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ మాక్ పార్లమెంట్ నిర్వహించినప్పుడు అప్పటి స్పీకర్ మీరా కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, స్వయంగా సోనియా గాంధీ దానిని “ఏ మాకరీ ఆఫ్ డెమోక్రసీ” (ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే) అని తప్పుబట్టారని గుర్తుచేశారు. నాటి వ్యాఖ్యలపై నేడు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. పండుగల రద్దీ వేళ రైల్వే నిబంధనల ప్రకారం ముందస్తు బుకింగ్ చేసుకోకుండా, తమ వైఫల్యాలను దక్షిణ మధ్య రైల్వేపై నెట్టడం క్షమించరాని చర్య అని కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.
మూసీ నిర్వాసితులకు అండ
మూసీ నది ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన రాంచందర్ రావు, సుందరీకరణ పేరిట నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా పేదల ఇళ్లు కూల్చితే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులతో నేరుగా ప్రజాదర్బార్ నిర్వహించి, సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు.
2న అమిత్ షా మహా పాదయాత్ర
నవంబర్ 2న హైదరాబాద్ విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనే చారిత్రక ‘మహా పాదయాత్ర’ మధ్యాహ్నం 3 గంటలకు బషీర్‌బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ప్రారంభమై మొజాంజాహి మార్కెట్ వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారని తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణపై స్పష్టత
ఎస్‌ఎస్‌ఆర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి సతీష్ జార్కిహోళి స్వయంగా ప్రకటిస్తే, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేయడం హాస్యాస్పదమన్నారు.
మియాపూర్ భూముల వేలం నిర్ణయం దివాకోరుతనం.
అత్యంత విలువైన మియాపూర్ 550 ఎకరాల భూములపై సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే తీర్పు వచ్చిన మరుక్షణమే ఆ భూములను వేలం వేసి అమ్మేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని సుమారు 550 ఎకరాల భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ బంధువులకు, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి చూస్తే, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని తీర్పు ఇచ్చిందని, దీనిని బీజేపీ సంపూర్ణంగా స్వాగతిస్తోందన్నారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా ప్రభుత్వం
తీర్పు వెలువడగానే ఏమాత్రం ఆలోచించకుండా పక్కా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారిపోయి వేలం పాట వేస్తామనడం కాంగ్రెస్ దిక్కుమాలిన వైఖరికి, పరిపాలనా దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పాలన సాగిస్తారా అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను విక్రయించడం మూర్ఖపు నిర్ణయమని, స్థానికంగా అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఆలోచన చేయకుండా వేలం వేయడం సరికాదన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పోటీ:
నాడు కేసీఆర్ బంధుప్రీతి.. నేడు రేవంత్ దోపిడీ నీతి అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులను కాజేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయని ఆరోపించారు. వేలం పాట ముసుగులో భూములను తమ సొంత అనుచరులకే కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఈ భూములు రేవంత్ రెడ్డి కుటుంబానిదో, అనుచరుల జాగీరో కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఉమ్మడి ఆస్తి అని గుర్తుచేశారు. మియాపూర్ భూముల్లో ఒక్క ఇంచు స్థలం అన్యాక్రాంతమైనా చూస్తూ ఊరుకోమని, క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి వేలం పాటను ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.
పార్టీలో భారీ చేరికలు
మీడియా సమావేశం అనంతరం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విశ్రాంత ఉన్నతాధికారులు, ఇంజినీర్లు బీజేపీలో చేరారు. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ హన్మంతరావు, ఆర్ అండ్ బీ రిటైర్డ్ ఈఈ కస్తూరి లక్ష్మీవెంకటరమణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సి.హెచ్. రమేశ్, ఎస్‌బీఐ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ వెంకటేశం గుప్తా, మాజీ వైశ్య సంఘం అధ్యక్షుడు భూమలింగం గుప్తాతోపాటు పలువురు ప్రముఖులకు రామచందర్ రావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




