– 5న సింగరేణి దీపావళి బోనస్ చెల్లింపు
– దీపావళి శుభాకాంక్షలతో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి
– ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చెల్లింపు
– దాదాపు 38 వేల మంది కార్మికులకు అందనున్న బోనస్
సింగరేణి భవన్, ప్రజాతంత్ర, అక్టోబరు 30 : ఇటీవలే లాభాల వాటా బోనస్ (దసరా బోనస్)ను అందుకున్న సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నవంబర్ 5వ తేదీన దీపావళి బోనస్ ను చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సింగరేణి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్ (దీపావళి బోనస్)ను నవంబర్ 5వ తేదీన చెల్లించాల్సిందిగా సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. బోనస్‌గా రూ.419 కోట్లను చెల్లించనున్నట్లు, ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 చొప్పున దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు వివరించారు. రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ అభివృద్ధి విస్తరణకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. లాభాల వాటా కింద ఈ నెలలో దాదాపు రూ.600 కోట్లT చెల్లించగా తాజాగా రూ.419 కోట్ల దీపావళి బోనస్ చెల్లించబోతున్నట్లు తెలిపారు. బొగ్గు రంగంలో పోటీని అధిగమించేందుకు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలపై సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంబంధిత పర్సనల్, ఫైనాన్సు అధికారులతో మాట్లాడి నవంబర్ 5న దీపావళి బోనస్‌ను కార్మికుల బ్యాంకు ఖాతాల్లో చెల్లింపునకు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎన్సీడబ్ల్యుఏ ఉద్యోగులకు వర్తింపు
దీపావళి బోనస్ కింద సగటున ఒక్కొక్క కార్మికుడికి ఈ సారి రూ.1,10,250లు అందనున్నాయి. ఈ బోనస్ కేవలం ఎన్సీడబ్ల్యూఎ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అధికారులకు వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల విభాగంలో 190 పని దినాలు, ఓపెన్ కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తిస్థాయిలో బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ పని దినాల హాజరు కలవారికి వారు పని చేసిన కాలానికి నిష్పత్తి ప్రకారం బోనస్‌ను లెక్క కట్టి చెల్లించనున్నారు. అయితే ఈ బోనస్ పొందడానికి కనీస అర్హతగా గత ఆర్థిక సంవత్సరంలో ఏ కార్మికుడైనా కనీసం 30 రోజులు పని చేసి ఉండాలని నిర్ణయించారు. మొత్తం మీద సుమారు 38,000మంది ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించనుంది.నెల రోజుల వ్యవధిలోనే దసరా, దీపావళి బోనస్‌ల రూపంలో సగటున దాదాపు రూ.2,65,000ను కార్మికులు అందుకోబోతున్నారు. సింగరేణి యాజమాన్యం ఈ రెండు బోనస్ లతో కలిపి ఒక్కో కార్మికుడికి సుమారు రూ.1,020 కోట్లను చెల్లించింది. ఈ నేపథ్యంలో సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సింగరేణి ఉద్యోగులకు తన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికులు బోనస్‌ల సొమ్మును తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని, అవకాశం ఉంటే పొదుపు చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ పండుగల స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేయాలని గనుల వారీగా, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




