ఎన్నికల ప్రచారంలో పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా
శ్రీనగర్, సెప్టెంబర్ 28 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేయడానికి జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో శనివారం ఆమె మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాపై విరుచుకుపడ్డారు.
జమ్మూకశ్మీర్ పట్ల కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. దర్బార్ సంప్రదాయాన్ని (సీజన్ వారీగా జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రభుత్వ కార్యాలయాల మార్పిడి) పునరుద్ధరిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్ పౌరుల హక్కులను కాపాడుతామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హమీ ఇచ్చారు.
తన నాన్నమ్మ ఇందిర గాంధీకి జమ్మూకశ్మీర్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆమె హత్య కావడానికి నాలుగైదు రోజుల ముందు కశ్మీర్ అందాలను చూడాలనుకుంటున్నట్లు తమతో పేర్కొన్నారని ప్రియాంక తెలిపారు. జమ్మూకశ్మీర్‌పై ప్రధాని మోదీకి ఏమాత్రం ప్రేమ లేదని, వారి సమస్యలు ఆయనకు పట్టవని విమర్శించారు. తమ రాజకీయ చదరంగంలో జమ్మూకశ్మీర్ అనేది ఒక పావు మాత్రమేనని విమర్శిచారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి జమ్మూకశ్మీర్ అంశాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు.