హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్30: జన్వాడ ఫాంహౌస్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతుల్లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్ సపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధీనంలో ఉండడం, బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్ పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించారని సమాచారం. ఈ ఫాంహౌస్‌ను ర్జాగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఎనిమిదేళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో గ్రామపంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడంగా గుర్తించారని తెలుస్తోంది. ఫాంహౌస్ యజమాని ఎన్.ఎస్.ఎల్.ఆర్.ప్రసాదరాజు చిరునామాకు నోటీసులు సైతం పంపించారని సమాచారం. ఆయన స్పందించకపోవడంతో పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్దిరోజుల తర్వాత ఫాంహౌస్‌కు ఇంటి నంబర్ 4-5 కేటాయించి అసెస్‌మెంట్ చేశారు. ఫాంహౌస్ విస్తీర్ణం 362 గజాలని, 3,200 చదరపు అడుగుల్లో ఉందని గ్రామపంచాయతీ అధికారులు లెక్కలు వేసి.. ఏటా రూ.11 వేలు పన్ను చెల్లించాలని అసెస్‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీ.ఓ. నంబరు 111 పరిధిలో ఫాంహౌస్ ఉందని తెలిసినా.. దాన్ని వేరే యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్న భావనతో అప్పట్లో వారు పన్ను మాత్రమే విధించారు. ఆ మేరకు నిర్వాహకులు ఏటా ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. జన్వాడ ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న బుల్కాపూర్ నాలా పరీవాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు గురువారం సర్వే పూర్తి చేశారు. ఉపగ్రహ చిత్రాలు, గ్రామపటాలను సరిపోల్చారు. నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా? లేదా? అని నిర్దారించుకున్నాక రంగారెడ్డి కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు. ఇప్పటికే అధికారులు వరుసగా పలు దఫాలుగా ఇక్కడ పరిశీలన చేశారు. అయితే ఈ ఫామ్ హౌజ్ తనది కాదని, తన మిత్రుడిదని మాజీమంత్రి కెటిఆర్ ప్రకటించడం కొసమెరుపు.