బాల్క సుమన్ అరెస్ట్‌

– సింగరేణిపై వ్యాఖ్యల నేపథ్యంలో
– ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటానన్న బాల్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్‌ను అరెస్టు చేశారు. ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. సుమన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆనంద్ అనే వ్యక్తి ఆయనపై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బొగ్గు గని కార్మికుల సమావేశంలో సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ’సింగరేణిని తగలపెట్టండి. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ఆఫీసులను తగలబెడదాం. నెల రోజులు జైలుకు పోయి వస్తాము’ అని సుమన్ కామెంట్లు చేసినట్లు ఆనంద్ తెలిపాడు. అరెస్టుకు ముందు సుమన్ మీడియాతో మాట్లాడుతూ నేను ఎక్కడికీ పారిపోలేదు. తెలంగాణ భవన్‌లోనే ఉన్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. ఉద్యమ సమయంలో నాపై 250కి పైగా కేసులు పెట్టారు. క్యాతనపల్లి ఎన్నిక సమయంలోనూ జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటాం. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు.. దానినే ప్రశ్నించానన్నారు. మరోసారి నన్ను జైలుకు పంపాలని రేవంత్, వివేక్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆయన వెనక కేసీఆర్ కుట్ర దాగి ఉంది : బల్మూరి

బాల్క సుమన్ అరెస్టు కావడానికి కారణం ఆయన మాటలేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గాంధీభవన్‌లో ప్రభుత్వ విప్ అయిన బల్మూరి మీడియాతో మాట్లాడుతూ సుమన్ వ్యాఖ్యల వెనక కేసీఆర్ కుట్ర ఉందన్నారు. మీకు కోపం ఉంటే మాపై దాడి చేయండి.. సామాన్య ప్రజలు తిరిగే రైళ్లపై ఎందుకు అంత అక్కసు అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనూ నిరసన కార్యక్రమాలు చేశాను.. మేం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేశాము అని వెంకట్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారన్న సుమన్ ఆరోపణలకు కౌంటర్‌గా వెంకట్ స్పందించారు. కేసీఆర్ ఒకాయనకు డ్రగ్ శాఖ ఇచ్చాడు.. మరొకరికి పిచ్చోడిలా వాగే శాఖ ఇచ్చాడు. సుమHకు రైలు పట్టాలు కోసే శాఖ ఇచ్చాడు.. బీఆరఎస్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటూ సుమన్ లాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్టు పెట్టాలంటూ బల్మూరి ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ నేతలవి దుర్మార్గపు ఆలోచనలు : అద్దంకి దయాకర్

బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. ఇటీవల బీఆరఎస్ నాయకులు వాడుతున్న భాష, చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ శైలిపై, వారి అణచివేత ధోరణిపై నిప్పులు చెరిగారు. ’బాల్క సుమన్‌తో ఎవరు మాట్లాడించారో తెలియాలి.. పట్టాలు కోయాలని, దాడులు చేయాలని పిలుపునివ్వడం పూర్తిగా బీఆర్ఎస్ కుట్రేనన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ నైజం. ఆయనకు తెలిసిన రాజకీయ నీతి ఇదే. కేసీఆర్ తనకు తెలిసిన కుటిల రాజకీయాన్నే కొడుకు కేటీఆర్‌కు నేర్పించారు. కేటీఆర్ తనకు తెలిసిన ఆ నీతినే సుమన్‌కు నూరిపోశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ తప్పులు చేసి దాన్ని ప్రశ్నిస్తే జై తెలంగాణ అంటారు.. ఫార్ములా రేస్ నిధుల దుర్వినియోగంపై విచారణకు వెళ్తూ కూడా కేటీఆర్ జై తెలంగాణ అంటారు.. తప్పులు చేసి వాటిని గొప్పగా చెప్పుకోవడం ఆ పార్టీ నేతలకే చెల్లిందన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, చివరకు రైతులను కూడా రెచ్చగొట్టడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్న ఆ పార్టీ నాయకులు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. సుమన్‌తో మాట్లాడించింది ఎవరో పోలీసు అధికారులు విచారణ చేయాలన్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనల నుండి బీఆర్ఎస్ నేతలు బయటకు రావాలని హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *