హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా-సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శాట్‌స్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సోనిబాలా దేవి, ఐఎఫఎస్ లోక్‌భవన్‌లో గవర్నర్‌ను శనివారం కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆహ్వానాన్ని స్వీకరించి కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. సైక్లింగ్ ర్యాలీ ఏర్పాట్లపై ఎల్‌బీ స్టేడియంలోని శాట్‌స్ కార్యాలయంలో వివిధ సైక్లింగ్ సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను ఖరారు చేశారు.‘ఫిట్‌నెస్‌కి డోస్-ఆధా గంటా రోజ’ నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సాధారణ ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్, చురుకైన జీవన విధానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సైక్లింగ్ ర్యాలీ ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, పిస్తా హౌస్ జంక్షన్, బిట్స్, కేబుల్ బ్రిడ్జ్, మాదాపూర్, భారతీయ విద్యాభవన్ సెంటర్ రోడ్, బయోడైవర్సిటీ రోడ్ మీదుగా తిరిగి స్టేడియంకు చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది సైక్లిస్టులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాల్గొనే వారందరికీ తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తరఫున పతకాలను, సర్టిఫికెట్లు అందజేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు నమోదు, ఇతర వివరాల కోసం గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కె.మధును 9000033100 నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




