పాలమూరు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– అజిలాపురం ఎత్తిపోతలకు శంకుస్థాపన
– 4, 5లలో సీఎం రేవంత్‌తో కలిసి ప్రాజెక్టుల పరిశీలిస్తాం

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 30 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం అజిలాపురంలో రూ.32.05 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అజిలాపురం లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్ సోర్స్ నుండి అజిలాపురం, గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాల్లోని 1400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే ప్రాధాన్యత ఇచ్చి ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని గత పాలకులు చెప్పినవన్నీ అబద్ధాలని, ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేకపోయారని విమర్శించారు. రాబోయే రెండున్నర ఏళ్లలోనే కొడంగల్-నారాయణపేట, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

4, 5 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

జూన్ 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి తాను ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 4న జూరాల ప్రాజెక్టు నుండి ప్రారంభించి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, నార్లాపూర్, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ (పునరావాసం), పెండింగ్ బిల్లుల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మంజూరు చేసి పనులను వేగవంతం చేస్తామని ప్రకటించారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తి.. మంత్రి సానుకూల స్పందన

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్ సాగర్ కాలువల మరమ్మతులకు రూ.150 కోట్లు మంజూరు చేస్తే అదనంగా 22 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే రూ. 87 కోట్లతో సిద్ధం చేసిన చౌదరిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వాలని కోరగా మంత్రి ఉత్తమ్  సానుకూలంగా స్పందిస్తూ ప్రాజెక్టును మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

శంకుస్థాపన అనంతరం అజిలాపురం శివార్లలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి సందర్శించారు. కొనుగోళ్లు, మద్దతు ధర చెల్లింపులపై రైతులతో నేరుగా మాట్లాడారు. ఐపీఎస్ ద్వారా ధాన్యం సేకరిస్తూ మద్దతు ధర నేరుగా తమ ఖాతాల్లో జమ అవుతుండటంపై రైతులు మంత్రుల వద్ద సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, ఎస్పీ డి.జానకి, స్థానిక సర్పంచ్ అనంతమ్మ, జడ్పీ మాజీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *