పాలమూరు ప్రాజెక్టుల పూర్తికి చరిత్రాత్మక అడుగు  

– యుద్ధప్రాతిపదికన ఇరిగేషన్ పనులు
– పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే క్లియర్
– ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్ వన్
– కాంగ్రెస్ హయాంలో వరి రైతులకు రూ.98,600 కోట్ల చెల్లింపులు
–  మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 30 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తమ హయాంలోనే పూర్తి చేసి, జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైన ముందడుగు వేస్తోందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి తాను ఈ నెల 4వ తేదీ సాయంత్రం నుండి 5వ తేదీ సాయంత్రం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ వేదికగా ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ పనులన్నింటినీ వేగవంతం చేయడానికి ఈ పర్యటన మైలురాయిగా నిలుస్తుందన్నారు. 4వ తేదీ సాయంత్రం తాము మొదట జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటామని, అక్కడినుండి ప్రారంభించి ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలిస్తామని పేర్కొన్నారు. 4వ తేదీ రాత్రి సోమశీలంలో బస చేస్తామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ నుంచి ఉద్దంలాపూర్ వరకు పనులను, అలాగే కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతలు, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా వంటి అన్ని ఆన్‌గోయింగ్ స్కీమ్స్‌ను స్వయంగా పరిశీలిస్తామని మంత్రి వివరించారు. ఈ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్, రెండు హెలికాప్టర్లు దిగడానికి వీలుగా ప్రతి చోటా రెండేసి హెలిప్యాడ్‌లను సిద్ధం చేయాలని కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. 4వ తేదీ రాత్రి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఇరిగేషన్ పనులపై సమగ్ర సమీక్ష ఉంటుందన్నారు.

టోకెన్లు పంపండి.. పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ), ఆరఅండఆర్ (పునరావాసం), ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. వర్క్ బిల్స్ పెండింగ్ విషయంలో ఎక్కడెక్కడైతే టోకెన్స్ రెడీగా ఉన్నాయో వాటిని జిల్లా కలెక్టర్లు ఈ నెల 2, 3 తేదీల్లోగా ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్‌కు పంపిస్తే సీఎం పర్యటనలోనే ఆ మొత్తాన్ని క్లియర్ చేస్తాము అని మంత్రి భరోసా ఇచ్చారు.

ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు

పంటల కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గణాంకాలను విడుదల చేశారు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు పంటలు చేతికి వచ్చాయని, ఈ కాలంలో áదేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి, అత్యధిక ధాన్యం సేకరణ జరిగిందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం ధాన్యం సేకరణలో 60 శాతం వాటా ఒక్క తెలంగాణ రాష్ట్రానిదే కావడం మనందరికీ గర్వకారణమన్నారు. సీజన్ ముగిసేసరికి దేశ రబీ ప్రొక్యూర్మెంట్‌లో తెలంగాణ షేర్ 75 శాతానికి చేరుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరి రైతులకు మద్దతు ధర కింద ఏకంగా రూ.98,600 కోట్లు నేరుగా అకౌంట్లలో జమ చేసింది. సగటున ఏడాదికి రూ.49,300 కోట్లు రైతులకు చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సగటున 7,000 కేంద్రాలు ఉంటే తాము అదనంగా 857 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

రికార్డు స్థాయి టార్గెట్లు
2024-25లో కేంద్రం టార్గెట్ 105 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తే మనం 128 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాము. ఈ ఏడాది (2025-26) కేంద్రం 112 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 146.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తోంది. రెండు పంటలు కలిపి రికార్డు స్థాయిలో 292 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి సాధించామని చెప్పారు. ఇప్పటివరకు 62.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో (23 లక్షల మెట్రిక్ టన్నులు), తమిళనాడులో (11.48 లక్షల మెట్రిక్ టన్నులు) జరిగిన కొనుగోళ్ల కంటే ఎంతో ఎక్కువ అన్నారు. యాసంగిలో మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల్లు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతు తెచ్చే చివరి గింజ వరకు కొంటామని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌లో 67%, హర్యానాలో 65%, ఒడిశాలో 52% ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం 38% ధాన్యాన్ని మాత్రమే కేంద్రం సేకరిస్తూ వివక్ష చూపుతోందని మంత్రి మండిపడ్డారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ఎంఎస్‌పీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.16,479 కోట్ల ఆర్థిక భారాన్ని భరించి వడ్లు కొనుగోలు చేస్తోందని తెలిపారు. బీఆరఎస్ ప్రభుత్వంలో లాగా కాకుండా పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కేవలం 48 నుంచి 72 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో పైసలు జమ అవుతున్నాయని స్పష్టం చేశారు. వర్షాలకు తడిసిన 1,020 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లర్లకు తరలించి రైతులకు అండగా నిలిచిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దిల్లీలో ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *