తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శం

  • దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం
  • భార‌త్‌లో ఇంకా బ‌లంగా కుల వివక్ష
  • కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ
  • దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా?
  • కుల‌గ‌ణ‌న‌పై బిజెపీవి అర్థం లేని ఆరోప‌ణ‌లు
  • ప్ర‌ధాని మోదీపై రాహుల్ విమ‌ర్శ‌నాస్త్రాలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : తెలంగాణ‌లో జ‌రిగే కుల‌గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శ‌మ‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ స్ప‌ష్టంచేశారు. దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకమ‌ని తెలిపారు. బోయిన్ పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ కులగణన సంప్రదింపుల సదస్సులో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ హాజ‌ర‌య్యారు. ఈ స‌దస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..

టైటానిక్ పడవను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు. కానీ సముద్రంలో ఒక మంచు కొండను ఢీకొని 20 నిమిషాల్లోనే మునిగిపోయింది. ఎందుకంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించింది. మిగతా అంతా నీటిలో లోతుగా ఉంది. బయటకు కనిపించిన చిన్న కొండను ఆ పడవ ఢీకొని కుప్పకూలింది.. అలాగే నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉంది. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది. మేము దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటుంన్నాం. అందుకే కుల గణన అనేది అత్యంత కీలకమైన అంశం. కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు.. ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుసుకోవాలి. ఏదైనా వ్యాధి తెలియాలంటే పరీక్షలే చేయాలి కదా.. మేము కుల గణన చేస్తాం. ఎవరికి ఏముందో తెలుసుకుందామంటే ప్రధాని.మోదీ ఎందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా..? మేము దేశవ్యాప్తంగా కుల గ‌ణ‌న చేసి వారి జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించాం. తెలంగాణలో కుల గ‌ణ‌న‌ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. తెలంగాణ కుల గ‌ణ‌న‌ చేపట్టడానికి ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దు. ప్రజల నుంచి వారి ఆలోచినలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయించాలి. తెలంగాణ కుల గ‌ణ‌న దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది . దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో చెప్పారు. వివక్ష తొలగించి అందరికీ సమానంగా జాతి సంపద అందించేందుకు కృషి చేస్తాం అని రాహుల్ గాంధీ అన్నారు.

తాను పాదయాత్ర చేసిన సమయంలో దేశమంతా తిరినప్పుడు.. ప్రజల్లో ఉన్న వివక్ష తనను ఆలోచనల్లో పడేసిందని రాహుల్, దానిని తాను తట్టుకోలేకపోయానని అన్నారు. ఓ రాజకీయ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకుంటున్నాన‌ని అన్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలకు దేశంలో సరైన గౌరవం ఉందని చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలున్నాయని అబద్ధాలు చెప్పలేకపోతున్నాను అని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో నిర్వహించనున్న కుల గణన ద్వారా.. అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచుతామని ప్రకటించారు. రాజకీయాల్లోనూ వాటి వాటాను నిర్ణయించేందుకు.. ఈ గణన ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణాలో జరుగుతుంది.. కుల గణన మాత్రమే కాదని, రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను నిర్దేశించే ప్రక్రియ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page