- యుద్ధప్రాతిపదికన వరంగల్ ఎయిర్ పోర్ట్ పనులు
- ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
- వరంగల్ అభివృద్దిపై విస్తృత స్ధాయి సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : గొప్ప చారిత్రిక నేపథ్యం కలిగిన వరంగల్ నగర అభివృద్దికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేస్తారని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసిహెచ్‌ఆర్‌డీ లో వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన మాస్టర్ ప్లాన్, వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి టెంపుల్ అభివృద్ది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్‌పోర్ట్, ఎకో టూరిజం తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను తమ ప్రభుత్వం కొలిక్కి తీసుకువొచ్చిందని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్‌కు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 41 కిలోమీటర్ల పరిధి ఉన్న వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును మూడు దశల్లో చేపట్టాలని మొదటి దశలో 20 కిలో మీటర్లు, రెండో దశలో 11 కిలోమీటర్లు, మూడవ దశలో 9 కిలోమీటర్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మరెక్కడా ఎయిర్‌పోర్ట్ లేదని వరంగల్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ రాబోతోందని, వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్ట్ పనులను ప్రారంభించి ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 382 ఎకరాల పరిధిలో ఉన్న చారిత్రాత్మకమైన భద్రకాళి చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించాలని, ఇందుకు సంబంధించిన పనులను బుధవారం నుంచే మొదలు పెట్టాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చెరువును ఖాళీ చేయాలని అధికారులకు సూచించారు . ఈ చెరువు 40 శాతం గుర్రపుడెక్కతో నిండిపోయిందన్నారు. మెగా టెక్స్ టైల్ పార్క్ లో ఏర్పాటు చేసిన కంపెనీలు తప్పనిసరిగా స్దానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.
సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కె.నాగరాజు, నాయిని రాజేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సిఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, ఎంఎయూడి. ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, రోడ్లు, భవనాల కార్యదర్శి హరిచందన, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సత్యశారద, పి. ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు