మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని, దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలతో దృఢంగా నిలిచాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పెట్టుబడుల్లో 115 శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడమే కాక.. ఉద్యోగాల కల్పనలో 20 శాతం వృద్ధిరేటు సాధించిందని తెలిపారు.
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు 30 శాతం ఉద్యోగ అవకాశాలు లభించాయని, ఎంఎస్ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. . కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పాలనలో సాధించిన ఘనతను వారి ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటోందని, ఎంఎస్ఎంఈ అభివృద్ధికి తాము చేసిన కృషి ఏంటో భవిష్యత్తు కార్యాచరణ ఏంటో చెప్పకుండా గత ప్రభుత్వ విజయాలతో కాలం గడపడం శోచనీయమని హరీష్ రావు విమర్శించారు.