– గ్రేహౌండ్స్ ఆపరేషన్స్‌పై డీజీపీ ఆనంద్ సమీక్ష
~ ప్రభుత్వ పరిశీలనలో పోస్టుల 708 సరెండర్ ప్రతిపాదన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్ సిబ్బందికి అందిస్తున్న శిక్షణ ప్రమాణాలు, పాఠ్యాంశాలు, మాడ్యూల్స్‌లో నిరంతరం ఆధునికత ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రధానమైన గ్రేహౌండ్స్ కార్యకలాపాలపై ఆయన గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ¾ గ్రేహౌండ్స్ నిర్వహిస్తున్న వివిధ ఆపరేషన్లు, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించారు. మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో గ్రేహౌండ్స్ ప్రదర్శిస్తున్న తీరును, వారికి అప్పగించిన ఇతర బాధ్యతల నిర్వహణను ఈ సందర్భంగా డీజీపీకి అధికారులు వివరించారు. కార్యకలాపాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యున్నతస్థాయి పోరాట పటిమను చాటాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించాలని, కఠినమైన శిక్షణ ద్వారా బలగాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలాన్ని తగ్గించే అంశంపై కూడా డీజీపీ సుదీర్ఘంగా చర్చించారు. గ్రేహౌండ్స్‌కు సంబంధించి 708 సరెండర్డ్ పోస్టుల ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికారులకు వివరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తగిన ఉత్తర్వులు అందిన తర్వాతే సిబ్బందిని తిరిగి మాతృ విభాగాలకు పంపే ప్రక్రియను చేపడతామని స్పష్టం చేశారు. గ్రేహౌండ్స్ సిబ్బంది కనబరుస్తున్న అంకితభావం, వృత్తి నైపుణ్యాన్ని ఈ సందర్భంగా డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోనే అత్యుత్తమ మావోయిస్టు వ్యతిరేక దళాల్లో ఒకటిగా గ్రేహౌండ్స్‌కు ఉన్న పేరును కాపాడాలని, క్రమశిక్షణ, ముందస్తు సన్నద్ధతతో తమ ప్రత్యేకతను చాటుకోవాలని సూచించారు. డీజీ- ఆపరేషన్స్( గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్) డాక్టర్ అనిల్ కుమార్, గ్రూప్ కమాండర్ రాఘవేందర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
ఆక్టోపస్ పనితీరును సమీక్షించిన డీజీపీ
రాష్ట్రంలోని కౌంటర్ టెర్రర్ ఫోర్స్ ‘అక్టోపస్’ పనితీరు, శిక్షణ కార్యకలాపాలు, ఆపరేషనల్ సన్నద్ధతను డీజీపీ ఆనంద్ గురువారం క్షుణ్ణంగా సమీక్షించారు. ఇబ్రహీంపట్నంలోని అక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన క్యాంపస్‌లోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, శిక్షణ విభాగం, ఆపరేషనల్ సౌకర్యాలతోపాటు కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమాండోలు, అధికారులతో ముఖాముఖి మాట్లాడి ఏవైనా అవాంఛనీయ ఉగ్రవాద సంఘటనలు ఎదురైతే వాటిని తిప్పికొట్టేందుకు సన్నద్ధత గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(స్వాట్) బృందాల పనితీరును, శిక్షణ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆపరేషన్స్ (అక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్) డీజీ డాక్టర్ అనిల్ కుమార్ డీజీపీకి పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ఆపరేషనల్ టీమ్స్ నిర్వహిస్తున్న రెగ్యులర్ కార్యకలాపాలు, కీలక సంస్థలు, సున్నిత ప్రాంతాల్లో కాలానుగుణంగా చేపడుతున్న మాక్ ఎక్సర్‌సైజులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాట విన్యాసాలు, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో కమాండోలకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణ గురించి వివరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి డీజీపీ ఆనంద్ మాట్లాడుతూ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రకాల భవన సముదాయాలు, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో మాక్ ఆపరేషన్లు నిర్వహించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కమాండోలు శారీరక దృఢత్వంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, ఎల్లప్పుడూ నిశితమైన అప్రమత్తతతో ఉంటూ 24 గంటలూ విధులకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అత్యాధునిక పరికరాల సేకరణ, మౌలిక సదుపాయాల బలోపేతంపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతోపాటు భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాల వ్యూహాలను పటిష్టం చేయాలని ఆదేశించారు. గ్రేహౌండ్స్, అక్టోపస్ దళాలు రాష్ట్రానికే గర్వకారణమని, వాటి వృత్తి నైపుణ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన కొనియాడారు. ఈ దళాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఎస్పీ (అడ్మిన్) ఎం.వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) సిహెచ్. రఘునందన్, ఇతర అక్టోపస్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





