ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

– భగీరథకు మధ్యంతర బెయిల్‌పై నేడు హైకోర్టు నిర్ణయం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిన్‌పై విచారణను హైకోర్టు వెకేషన్ బెంచ్ వారం రోజులకు వాయిదా వేసింది. అతని తరపు న్యాయవాది కృష్ణకాంత్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో గురువారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌పై నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేయగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక అంశాలను లేవనెత్తారు. కరీంనగర్‌లో బాధితురాలిపై తప్ప్పుడు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. బాధితురాలి తల్లి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో కరీంనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారని వివరించారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో ఈ కేసులో సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపీ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడని పదేపదే చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. భగీరథ్ తరఫున అడ్వకేట్ కృష్ణకాంత్ తన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో భగీరథ్‌పై ‘పోక్సో’ చట్టం వర్తించదని, ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. యువతి మైనర్ అనే నెపంతో విచారణకు వెళ్లే సమయంలో భగీరథ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ‘బండి సంజయ్ కుమారుడు కావడంతోనే నిరాధారంగా పోక్సో చట్టాన్ని ప్రయోగించారు.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పొలిటికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.. నిందితుడిని సామాన్యుడిలాగే పరిగణించి న్యాయం చేయాలి’ అని ఆయన కోరారు. తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని బాధితురాలి తరఫు న్యాయవాది కోరడంతో మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది. కాగా, ముందస్తు బెయిల్ రావడానికి వారం సమయం పట్టేలా ఉండటంతో ఆ లోపు అరెస్టు కాకుండా ఉండేందుకు భగీరథ్ న్యాయవాది మధ్యంతర బెయిల్ కోరారు. దీనిపై కోర్టు శుక్రవారం ఇచ్చే ఆదేశాలు కీలకం కానున్నాయి. బాలికపై లైంగిక దాడి, ఇతర నేరారోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టిన పేట్ బషీరాబాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్‌కు వెళ్లి విచారణ నిమ్తితం భగీరథ్‌ను వెంట తీసుకుని బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని అతడి మేనమామ వంశీకృష్ణకు నోటీసులు అందజేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం  నిందితుడు విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో తాను ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, పూర్తి ఆధారాలతో ఈ నెల 15న హాజరై పోలీసులకు సహకరిస్తానని, రెండు రోజుల గడువు ఇవ్వాలంటూ పోలీసులకు పంపిన ఈ`మెయిల్‌లో పేర్కొన్నాడు. ఇప్ప్పుడు బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ వాయిదా వేయడంతో 15న విచారణకు హజరవుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *