– మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్
– ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు
– కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : నీట్-యూజీ 2026 రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత పదేళ్లుగా ప్రధాని మోదీ హయాంలో 93 పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. దీంతో రెండు కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. పేపర్ లీక్ అయితే కనీసం సంబంధిత మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. నీట్ రద్దు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు వంటిదేనన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, నిర్లక్ష్యపూరితమైన ఈ నిర్ణయం దేశ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్నారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువతను తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయని చెప్పారు. తీవ్ర ఒత్తిడిలో ఏళ్లతరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కల్లలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, కొంతమంది పేరెంట్స్ నగలు అమ్మి తమ పిల్లలను ‘నీట’ సంసిద్ధులను చేశారÁని, వారి ఆశలన్నీ గల్లంతవడం బాధాకరమని అన్నారు. 2019 నుండి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినా ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీక్‌లకు ప్రధాన కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్ అయ్యాయన్నారు. 2014 మేలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలోని ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో వ్యవస్థీకృత లోపాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ విడుదల చేసిన ‘ది పేపర్ లీక్ డెకేడ్’ శ్వేతపత్రం ప్రకారం కేంద్ర, రాష్ట్ర పరీక్షలలో 93 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. 2024లో కేవలం ఎనిమిది వారాల్లోనే నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయని తెలిపారు. నీట్-యూజీ (24 లక్షల మంది అభ్యర్థులు), యూజిసి-నెట్ (9 లక్షలు), సీఎస్‌ఐఆర్-నెట్, నీట్-పిజి రద్దు అయినట్టు గుర్తు చేశారు. 2024లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష (16 లక్షల మంది మహిళలు సహా 48 లక్షల మంది అభ్యర్థులు) కూడా కొన్ని రోజుల్లోనే రద్దయిందని, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 14 ప్రధాన లీక్‌లు జరిగాయని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ కుంభకోణాల జాబితాలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (తప్పుడు మార్గాల నివారణ) చట్టం’ను ఆమోదించినప్పటికీ పెద్ద కుంభకోణాలు వెలుగు చూసిన తర్వాత 2024 జూన్ వరకు దాని నోటిఫికేషన్‌ను కేంద్రం ఆలస్యం చేసిందన్నారు. ‘నీట్డ్’ రద్దు నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని రేవంత్‌రెడ్డి భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి, వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని హమీ ఇచ్చారు.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





