Take a fresh look at your lifestyle.

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక
పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్న బాధితులు

వర్షాభావ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నా నిలకడగా ఉంది. గురువారం సాయంత్రానికి 51.3 అడుగులు ఉన్న గోదావరి శుక్రవారం ఉదయంకు 54.3 అడుగులకు చేరుకుంది. దీనితో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. ఇది క్రమక్రమంగా పెరుగుతూ శుక్రవారం సాయంత్రానికి 55.5 అడుగులకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రానికి ప్రవాహం తగ్గినట్టు కనబడుతుంది. ఎగువ ప్రాంతాల్లో వరద నీరు కాస్త నెమ్మదించటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయినప్పటికి ముంపు ప్రాంతాలు ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. భద్రాచలం పట్టణంలోని లోతట్టు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. వారు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు.

మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగటంతో మారుమూల గిరిజన గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాల్లో వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరద నీరు పొలాల్లోకి రావడంతో ఇప్పుడిప్పుడే వేసిన నారు పూర్తిగా వరద నీటితో మురిగిపోయింది. తక్షణ సహాయం కొరకు రైతులు ఎదురుచూస్తున్నారు. వరద ప్రవాహం మరింత ఎక్కువైతే బారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే గోదావరి రెండవసారి రావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పూరిల్లు నీటిలో మునిగి నేలమట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. దుమ్ముగూడెం, చర్ల వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్థంభించిపోయాయి. భద్రాచలంకు కూనవరం, విఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉండటంతో వరద నీరు అదేస్థాయిలో ప్రవహించటం వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్టీసి బస్సులు కూడ నిలిపివేసారు.  బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టీనగర్‌ ‌గ్రామం వద్ద బ్రిడ్జి భారీగా రంద్రం పడటంతో అధికారులు రహదారిని మూసివేసి మరమత్తులు చేపడుతున్నారు. భారీ వాహనాలను నిలిపివేసారు. దీని కారణంగా పాల్వంచ , కొత్తగూడెం, ప్రాంతాలకు కూడ రాకపోకలు స్థంభించాయి. ప్రస్తుతం మరమత్తులు చేయటంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ ప్రాంతాల్లోని పేరూరు, వాజేడు, వద్ద నీటి ప్రవాహం కాస్త శాంతించటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నిలకడగా ఉంది.

వరద ప్రాంతాల్లో ఎమ్మెల్సీ బాలసాని పర్యటన : వరద ముంపుకు గురైన బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ శుక్రవారం నాడు పరామర్శించారు.
అలాగే ముంపుకు గురైన రెవెన్యూ కాలనీ , ఏంసీ కాలనీ, సుభాష్‌నగర్‌ ‌కాలనీ, రామాలయం చప్టాదిగువ ప్రాంతాల్లో ఎమ్మెల్సీ పర్యటించారు. కరకట్ట వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ ‌ప్రాంతాన్ని కూడ పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వదర బాధితులకు అందుతున్న సహాయాన్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో బాధితులకు అధికారులు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసారని , సన్నబియ్యంతోనే భోజన సదుపాయం కల్పించటం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా కరకట్టను పొడిగించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరనున్నట్లు తెలిపారు. అలాగే స్లూయీస్‌ ‌సమస్య ప్రతీ ఏటా ఉంటుందని దానికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు తెలిపారు. భద్రాచలం పట్టణాన్ని సుందరంగ తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆయన వెంట యశోద నగేష్‌, ‌ధనేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Leave a Reply