పాఠ‌శాలల మూసివేత అమానుషం

– సీఎం ఈ చ‌ర్య‌ను ఉప‌సంహ‌రించుకోవాలి
-విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలి
– నిరుపేద‌ల‌కు విద్య‌ను దూరం చేయ‌వ‌ద్దు
– తెలంగాణ విద్యా ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : బెంగళూరులో “ది హిందూ” పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అప్రజాస్వామ్యం, అమానుషం అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ విమ‌ర్శించింది.  ఆచరణ సాధ్యంకాని విధానాలు ప్రకటించి ప్రజలకు విద్యను మరింత దూరం చేసే చర్యగా వేలాది పాఠశాలల మూసివేతను చూడాల్సి ఉంటుంది. ప్రతిరోజు కొత్త విధానాలతో పిల్లలను పరీక్షించే వేదిక పాఠశాల కాదు! ఈరోజు ఒక తీరు, రేపోక తీరు, ఎల్లుండి మరో మార్పులతో ఇలా గాలివాటం విధానాలతో విద్యారంగాన్ని గందరగోళంలో పడేస్తున్నారు. నిర్దిష్టమైన విద్యా విధానంతో తెలంగాణ పాఠశాల విద్యా విధానాన్ని రూపొందించాలని కోరుతూ ప్రభుత్వం పాఠశాలల మూసివేత ప్రతిపాదనను విరమించుకోవాలని, బడ్జెట్లో 20% నిధులు విద్యారంగానికి కేటాయించి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని శ‌నివారం నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఇంకా ఈ స‌మావేశంలో పాల్గొన్న మేధావులు మాట్లాడుతూ విద్యార్థి నివసించే ఆవాసానికి సమీపంలో పాఠశాల అందుబాటులో ఉండాలని, ఆ బాధ్యతను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని “విద్యా హక్కు చట్టం-2009” చెప్తోంది. ఆర్టీఈ- 2009 సెక్షన్ 5 (1) (ఏ) (బి) ప్రకారం ఐదో తరగతి లోపు చదివే విద్యార్థులకు ఒక కిలోమీటర్ దూరంలో, ఆపై తరగతులు చదివే విద్యార్థులకు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వమే పాఠశాల సౌకర్యం కల్పించాలని స్పష్టంగా ఉంది. దీని ప్రకారం ముఖ్యమంత్రి ప్రకటన చట్ట ఉల్లంఘనే అవుతుంది. బడ్జెట్లో విద్యారంగానికి 15% కేటాయిస్తామని చెప్పి ఇప్పటికీ 8.2 శాతానికి మించట్లేదు. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో మూతబడిన 6 వేల పాఠశాలలను వెంటనే తెరిపిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. కానీ గత రెండేళ్లలో వేలాది పాఠశాలలను మూసివేసింది. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం జాతీయ ర్యాంకింగ్ లో తెలంగాణ 26 నుండి 28వ స్థానానికి దిగజారింది. దేశంలోని 783 జిల్లాల్లో తెలంగాణలోని 28 జిల్లాలు 300 నుండి 675 స్థానాల్లో ఉన్నాయి. ఇవి బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడిన జిల్లాలతో సమానంగా ఉన్నాయి. రాష్ట్రంలో బహుళ తరగతి బోధన వలన ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం కోల్పోయి, పిల్లలు తగ్గిపోయారు. తరగతికి ఒక టీచరు, ఒక గది ఉండేలా చూస్తే ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలు వస్తారు. ఆ మేరకు ప్రభుత్వం విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను ప్రభుత్వ స్కూళ్ళ ప్రక్కకే అనుమతులు ఇవ్వడం, వలసలు మొదలైన కారణాలున్నాయి. దీనిపై సమగ్రమైన అధ్యయనం ప్రభుత్వమే చేపట్టాలి. కారణాలు తెలుసుకొని పరిష్కారాలు కనుక్కోవాలి. ప్రస్తుతమున్న 1023 రెసిడెన్షియల్ స్కూళ్ళలో 630 సూళ్ళకు స్వంత భవనాలు లేవని, కులాల వారిగా నిర్వహించడం సమంజసం కాదనే కారణాలతో 105 ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ళను’ 21వేల కోట్లతో నిర్మించ పూనుకొంది. కేవలం 2వేల కోట్లతో ప్రస్తుతము అద్దె భవనాలల్లో నిర్వహిస్తున్న వానికి స్వంత భవనాలు నిర్మించి అన్ని సామాజిక వర్గాలకు కొనసాగుతున్న నిష్పత్తిలో అన్ని స్కూళ్ళలో అడ్మిషన్స్ కల్పిస్తే సరిపోతుంది. మిగతా వేల కోట్ల రూపాయలతో 27వేల పాఠశాలలను అభివృద్ధి చేయవచ్చు. 27 వేల పాఠశాలలను పటిష్టంగా నిర్వహించే శాశ్వత విధానాలు కావాలి. అందుకోసం ఈ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం నిధుల కేటాయింపు జరగాలి. పాఠశాలల పర్యవేక్షణ కోసం 25 కొత్త జిల్లాలకు డిఇవో పోస్టుల మంజూరీతో పాటు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మండల విద్యాధికారుల పోస్టులను భర్తీ చేసే చిత్తశుద్ధి కలిగిన విధానాలు అమలు కావాలి. ఆచరణాత్మక విధానాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, తెలంగాణ సమాజపు అవసరాల ప్రాతిపదికన విద్యా విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. పూర్వ ప్రాథమిక విద్యా తరగతులు ప్రారంభించుటకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియామకం గురించిన శాశ్వత విధానం రూపొందించలేదు. ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యలో శిక్షణ ప్రారంభించి, తల్లిదండ్రులను ఆకర్షించే చర్యలు చేపట్టకుండా, విద్యార్థులు రావడం లేదనే సాకుతో పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం పేదలకు, వెనుకబడిన గ్రామీణ వర్గాల పిల్లలకు ప్రభుత్వవిద్య అందకుండా చేస్తోంది. ఈ చైతన్య కేంద్రాలు మూతపడితే గ్రామానికి భవిష్యత్తు ఉండద‌ని స‌మావేశం స్ప‌ష్టం చేసింద‌ని  ప్రొ॥ కె.చక్రధర్ రావు అధ్యక్షులు ప్రొ॥ కె.లక్ష్మీనారాయణ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ప్రొ॥ హరగోపాల్ ప్రధాన కార్యదర్శి వెల్ల‌డించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *