మా ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కెటిఆర్ బృందం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20: మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న విషయమై గవర్నర్‌కు తెలిపామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కెటిఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు శనివారం గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుంగలో తొక్కుతున్నదో ఆయనకు వివరించాం. హామీలను అమలు చేయాలన్న విద్యార్థుల అరెస్టులు, అక్రమ కేసులతో భయానక వాతావారణం సృష్టిస్తున్నారని వివరించామని అన్నారు.
గవర్నర్ చాలా సీరియస్‌గా ఈ అంశాలపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్న అంశాన్ని గవర్నర్‌కు తెలిపాం. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని.. స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశామని ఆయనకు వివరించాం. ప్రొటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్‌కు వివరించామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బిఆర్ఎస్ అండగా అండగా ఉంటుందని.. వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ.. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు చేసి కేసు పెడుతున్నట్లు చెప్పాం. విద్యార్థులపై లాఠీలు ఝులిపిస్తూ.. భయానక వాతావరణం సృష్టించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను యూనివర్సిటీల్లో చూస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రకటనలు ఇచ్చారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. కేసీఆర్ హయాంలో జారీ అయిన గ్రూప్-1, 2, 3 నోటిఫికేషన్లు రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హాని గుర్తు చేశామన్నారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని గవర్నర్‌కు చెప్పామని కేటీఆర్ తెలిపారు. మెగా డీఎస్సీ అని చెప్పారు కానీ వేయలేదు. నిరుద్యోగ భృతి 4 వేలు ఇవ్వలేదు. అన్నింటికి మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులను బయటకు ఈడ్చుకొచ్చి హింసించారు. ఓయూలో హాస్టల్ ఉన్న విద్యార్థులపై దాడులు చేసి అప్రజస్వామికంగా వ్యవహరించారని చెప్పామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ మీద గెలిచి.. కాంగ్రెస్ టికెట్‌పై పార్లమెంట్‌కు పోటీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న అగౌరవాన్ని కూడా వివరించాం. ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖ రాస్తానని గవర్నర్ చెప్పారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తానని చెప్పారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని గవర్నర్ చెప్పారు. ఇక్కడితో ఆగకుండా రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండే పెద్దలను కలిసి కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని వివరిస్తాం. రాష్ట్రపతిని కూడా కలిసి చెబుతాం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హాని నిలబెట్టుకునే వరకు, గ్రూప్-2, 3 పోస్టులు పెంచేదాకా, నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, నిరుద్యోగులకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని, కాలె వెంకటేశ్,గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు.
కరెంట్ కోతల ఆందోళనలు చూసి ఎన్నాళ్లయ్యింది
ఫోటోను షేర్ చేస్తూ..కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 20: తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రతి రోజు, ప్రతి గంట.. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటున్నాయని బిఆర్‌ఎస్ విమర్శిస్తోంది. కరెంట్ కోతలు నిరంతరం విధిస్తుండడంతో అటు అన్నదాతలు, ఇటు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైతులు సబ్ స్టేషన్లను ముట్టడిస్తూ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ కోతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తెలంగాణలో కరెంట్ కోసం అన్నదాతల నిరసనలు చూసి యుగాలు అయిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది మార్పు మహత్యం అని ఆయన విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో గత కొద్ది రోజుల నుంచి కరెంట్ కోతలు ఉన్నాయి. కరెంట్ కోతల కారణంగా వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని నిరసన వ్యక్తం చేస్తూ నిన్న సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు రైతులు. కరెంట్ సరిగా లేకపోవడం కారణంగా గ్రామంలో కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు మండిపడ్డారు. రైతుల ధర్నాకు సంబంధించిన దృశ్యాలను కేటీఆర్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.