– ధర్మపురిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి
జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్ 30: గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ధర్మపురిలోని పుష్కర ఘాట్లను మంత్రి అడ్లూరి పరిశీలించి అధికారులతో సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గోదావరి పుష్కరాల కోసం ఏడాది ముందుగానే పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం,రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి అడ్లూరి చెప్పుకొచ్చారు. ధర్మపురి, కోటిలింగాల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.117 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య వ్యవస్థలు, భక్తుల విశ్రాంతి కేంద్రాల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గత గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయనున్నామని స్పష్టం చేశారు. రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, అత్యవసర వ్యవస్థలను బలోపేతం చేసి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తామని మంత్రి తెలిపారు. పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీల సహకారంతో పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించడమే తమ లక్ష్యమని వివరించారు. పుష్కరాల సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





