కాషాయం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌

– డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ‌లక్ష్యంగా నితిన్‌ ‌నబిన్‌ ‌పర్యటన
– కార్యకర్తలను ఉత్తేజపర్చిన ప్రసంగాలు
– ప్రాథమికంగా నాలుగు కార్పొరేషన్‌ల కైవసానికి ప్రణాళిక

బెంగాల్‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత బీజేపీ ద‌క్షిణాది వైపు గురిపెట్టింది. ఆమేర‌కు తెలంగాణలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు ఏర్పాటుకు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. రాష్ట్రంలో మూడు రోజుల‌పాటు ప‌ర్య‌టించిన జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బి పార్టీ శ్రేణుల‌ను సంసిద్ధుల‌ను చేశారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు పాల‌నా వైఫ‌ల్యంతో తిరిగి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, దాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని పార్టీ బూత్ లెవ‌ల్ అధ్య‌క్షుల‌కు, ఇత‌ర పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ముందుగా మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌పై కాషాయ జెండా ఎగుర‌వేసేందుకు ఇప్ప‌టినుంచే అలుపెర‌గ‌ని పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చారు.

                                                              (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ను నెలకొల్పడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌పర్యటన మూడు రోజులపాటు తెలంగాణలో కొనసాగింది. రాష్ట్రంపై కాషాయ జెండాను ఎగురవేసే కార్యాచరణ ప్రణాళికను ఎప్పటినుండో సిద్దం చేసినప్పటికీ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో పర్యటించిన నతిన్ ‌నబిన్‌ ‌పర్యటన మరింత పకడ్బందీగా ఆ ప్రణాళికను అమలు చేసే దిశగా కార్యకర్తలను, నాయకులను సిద్దం చేస్తున్నదనేందుకు మూడు రోజుల పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. బెంగాల్‌ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ చూపంతా దక్షిణాదిపైనే ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల నుండి తెలంగాణపైనే దృష్టిని కేంద్రీకరించింది. అయితే గత ఎన్నికల్లో ఆశించినమేర ప్రజలు ఆ పార్టీపై ఆసక్తిని కనబర్చలేదు. కనీసం 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ప్రజల దృష్టిని తమవైపు మళ్ళించుకునేందుకు ఆ పార్టీ విస్తృత స్థాయిలో ప్రణాళికలను రచిస్తోంది. అందులో భాగంగా ఇక్కడి నాయకులను, కార్యకర్తలను జాగృతం చేసేందుకే కేంద్రం నాయకులు, మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.తెలంగాణ సాధించిన పార్టీగా చెప్పుకునే బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌గత ప్రభుత్వంలాగే అనేక తప్పిదాలు చేస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకోవడంలో విఫలమైందన్న అపవాదను మూటగట్టుకోవడంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంలేదని, ఆలాంటప్పుడు బీజేపీనే ప్రత్యమ్నాయంగా ప్రజలు ఎంచుకునే అవకాశమున్నదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో నితిన్‌ ‌నబిన్‌ ‌చెప్పింది కూడా అదే. ‘ఇక బీఆర్‌ఎస్‌ ‌తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.. అందుకు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మనం ఎదగాల్సి ఉందం’టూ ఆయన హైదరాబాద్‌, ‌వరంగల్‌ ‌పర్యటనల్లో కార్యకర్తలకు హితబోధ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు అవిశ్రాంతంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని సూచించారు. ఏ జిల్లాకు ఆ జిల్లా నాయక‌త్వం స్థానిక సమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని ఆదేశించారు. ‌ప్రధానంగా రానున్న మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలే గీటురాయిగా సూచించారు.

ముందుగా కార్పొరేషన్‌లు గెలవాలి

రాష్ట్రంపై కాషాయ జెండా రెపరెపలాడాలంటే ముందుగా కార్పొరేషన్‌లు గెలవాల్సిందేనన్నారు. జీహెచ్‌ఎం‌సీ, సైబరాబాద్‌, ‌మల్కాజిగిరి, వరంగల్‌ ‌కార్పొరేషన్‌ మేయర్‌ ‌పదవులను చేజిక్కించుకున్నప్పుడే సులభంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ అందుకు ముఖ్యంగా బూత్‌ లెవల్‌ అధ్యక్షుల పాత్ర ప్రధానమైందన్నారు. వరంగల్‌లోనైతే ఆయన ఈ మేరకు పార్టీ శ్రేణులతో విజయం సాదిస్తామన్న సంకల్ప దీక్ష చేయించారు. అలాగే బూత్‌ ‌లెవల్‌ అధ్యక్షులు కూడా పిడికిలి బిగించి ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. త్వరలో రానున్న వివిధ కార్పొరేషన్‌ల ఎన్నికల విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నదనడానికి ఆయా ప్రాంతాల పర్యవేక్షకులుగా ప్రత్యేక నాయకులను నియమించింది. మహారాష్ట్ర మంత్రి ఆశిశ్‌, ‌రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మలను ఈ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షకులుగా ఇప్పటికే నియమించింది. ఇం‌దులో ప్రత్యేకంగా వరంగల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ప్రత్యేక బాధ్య‌తలను అప్పగించనున్నట్లు తెలుస్తున్నది. ఆయ‌న‌ నాయకత్వంలో కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌ బీజేపీ వశమైన విషయం తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కేంద్ర నాయకత్వం దృష్టిలో పెట్టుకునే ఆయన తప్పకుండా వరంగల్‌ ‌కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగురవేయించగల సమర్థుడిగా పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ కూడా అయిన సునీల్‌ ‌బన్సల్‌ ఇకనుండి పూర్తిస్థాయిలో పార్టీని పూర్తిస్థాయిలో పర్యవేక్షించే విధంగా కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. బన్సల్‌ ‌తెలంగాణతోపాటు బెంగాల్‌, ఒడిషా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆయన సమర్థవంతమైన పర్యవేక్షణలో ఆ రెండు రాష్ట్రాల్లో కాషాయం విజయం సాధించింది. దాంతో ఇప్పుడు తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించే విధంగా కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇదిలాఉంటే పక్క రాష్ట్రంలో మాదిరి  తెలంగాణలో కూడా రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుల‌పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో పోటీకి తాము సిద్దంగా ఉన్నట్లు ఇటీవల జనసేన, తెలుగుదేశం పార్టీలు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఈ అనుమానాలకు తావు ఏర్పడింది. అయితే రాష్ట్రంలో పర్యటిస్తున్న నితిన్‌ ‌నబిన్‌ ‌మాత్రం దాన్ని కొట్టిపారేశారు. రానున్న అన్ని ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ ఎన్నికల నాటికి ఏమైనా జరుగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *