హైడ్రా… ఇప్పుడు ఈ పేరు రాజధాని నగరంలో సంచలనంగా మారింది. ఆ పేరు వినగానే అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. ఇంతకాలం డబ్బు, పలుకుబడి, కండబలంతో ఆక్రమణలు చేపట్టిన వారికిది సవాల్‌గా మారింది. చూస్తుండగానే బహుళ అంతస్తుల భవనాలు నేలకూలుతున్నాయి. ఆ శిధిలాలు చూస్తుంటే ఎంతో తీవ్రమైన భూకంపం వొచ్చినట్లు ఆ ప్రాంతాలు కనిపిస్తున్నాయి. యధేచ్చగా అనుమతులు ఇచ్చిన అధికారుల ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఈ విషయంలో నీ నా, స్వపర భేదాలేవీలేవు. చిన్న, పెద్ద, పేద ధనిక అన్న తారతమ్యాలేవీ హైడ్రా పాటించడంలేదు. ఆ కట్టడానికి నిర్మాణ అనుమతులున్నా, ఇంటి పన్నులు చెల్లిస్తున్నా, విద్యుత్, నల్లా ఛార్జీలు చెల్లిస్తున్నా అవేవీ కూల్చివేతలను నిరోదించలేవన్నది అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత స్పష్టంచేస్తున్నది.
సమాజంలో పేరున్న సెలబ్రిటీలైనా, ప్రజాప్రతినిధులైన, ఇతర ప్రముఖులెవరి నిర్మాణలైనా సరే అక్రమమని హైడ్రా నిర్ధారించిందంటే అవి నేలకొరిగి పోవాల్సిందే. అది చెరువు శిఖంలో కట్టినదని రూఢీ అయితే చాలు వెనుకాముందు చూడకుండా హైడ్రా కూల్చివేస్తున్నది. చెరువులు, శిఖం భూములు, నాలాలను దశాబ్దాలుగా కబ్జాచేసుకున్నవారివైనా, కబ్జా స్థలాల్లో చేసిన నిర్మాణాలని తెలియక ఇండ్లు, కమర్షియల్ నిర్మాణాలను కొనుగోలుచేసినవారిప్పుడు లబోదిబో మంటున్నారు. అయిదేళ్ళు మొదలు మూడు దశాబ్దాలుగా అంటే తాతల కాలం నుండి గుడిసెలు వేసుకునో, రేకుల ఇండ్లలో కాలంగడుపుతున్నవారిని కనీసం వస్తువులైనా తీసుకునే అవకాశం హైడ్రా అధికారులు ఇవ్వకపోవడంతో వారి బతుకులు బజారున పడుతున్నాయి. తెల్లారేసరికి ఎవరి కొంప కూలుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితిలో రాజధాని నగర ప్రజలు ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంనుండీ ఈ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటినుండీ పాలన సాగించిన ప్రభుత్వాలు వీటివిషయంలో చూసిచూడనట్లుగా వ్యవహరించడమే నగర ప్రజలకు శాపంగా మారింది. ఏకాస్తా వర్షం పడినా నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రతీ వర్షాకాలం సుందరనగరం బీభత్సంగా మారుతూ వొస్తున్నది. ఇండ్లలోకి, అపార్టుమెంట్లలోకి వొచ్చిన నీరు రోజుల తరబడి నిలచిపోతున్నది. అందుకు నగరంలోని వేలది చెరువులు మాయమై, వాటిస్థానంలో కాంక్రీట్ జంగల్ ఏర్పడటమే కారణమని తెలిసినప్పటికీ గత ప్రభుత్వాలు ఆక్రమణల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా చేయని సాహాసచర్యను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి మస్తిష్కంనుండి ఉద్భవించిందే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటక్షన్). దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వింగ్‌నే ఏర్పాటు చేసింది. ఇది ఏర్పడిన దాదాపు నెల రోజుల్లోనే ప్రముఖులకు చెందిన పలు కట్టడాలను కూల్చివేసింది. దీని ప్రధాన లక్ష్యం చెరువుల చెరను విడిపించడమే.
వర్షాలతో అతలాకుతలం అవుతున్న నగరాన్ని ఉపద్రవం నుండి రక్షించాలన్నదే ప్రధాన సంకల్పం. బహుషా దేశంలోనే ఇలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిదై ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. చాలాకాలంగా ఎవరూ చేయలేని పనిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టినందుకు చాలామంది తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మాయమైన అనేక చెరువుల చరిత్రను బయటపెట్టే విషయంలో హైడ్రా అధికారులకు సహాయ పడుతున్నారు కూడా. అంతే కాదు హైడ్రా లాంటి సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని పలు జిల్లాల నుంచి పుంకాను పుంకాలుగా విజ్ఞప్తులు వొస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, నారాయణపేట, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, ఖమ్మం ప్రాంతాల ప్రజలు తమతమ జిల్లాల్లోని చెరువుల సంఖ్య, వాటి విస్తీర్ణం, కబ్జాకు ఎంత గురైనదన్న విషయాన్ని అంకెలతో సహా చెబుతున్నారు. తీగ కదిపితే డొంక కదిలినట్లు వీరు వారు అని కాకుండా ఎవరెవరి చెరలో ఎంత భూమి ఉందన్న విషయాలను కూడా వెల్లడిస్తున్నారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇది ఏ ఒక్కపార్టీకో, నాయకులకో వ్యతిరేకమైనది కాదన్న విషయాన్ని స్పష్టంచేశారు. అన్నట్లుగానే ఇప్పటివరకు హైడ్రా కూల్చిన వాటిల్లో ఏపార్టీకి చెందని సెలబ్రెటీ నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో పాటు కాంగ్రెస్ ముఖ్యనేత, బిజెపి నాయకులకు సంబందించిన కట్టడాలను కూడా కూల్చివేశారు.
తాజాగా బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే , మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు చెందినదిగా (లీజు తీసుకున్నట్లు) చెబుతున్న జన్వాడలోని ఫాం హౌజ్ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠతను కలిగిస్తున్నది. కాగా సిఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్వయంగా ముందుకొచ్చి తన ఇంటిని కూడా కూల్చుకోవచ్చని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. దుర్గం చెరువు పరిధిలో ఉన్నదన్న విషయాన్ని తెలియక తాను కొనుగోలు చేసానని, అయితే తాను ఖాలీ చేసేందుకు కొంత సమయం కావాలని ఆయన కోరారు. కాగా ఈ కూల్చివేతలపైన వ్యతిరేకతలు కూడా తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. ముందుగా ఏ మాత్రం చెప్పకుండా ఉప్పెనలా మీదపడి తమకు నిలువ నీడలేకుండా చేయడంపట్ల పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగులు, రోజువారీ కూలీల పరిస్థితి దారుణంగా మారింది. బియ్యం తో సహా నిత్యావసర వస్తువులను కూడా తీసుకునే అవకాశమివ్వకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ చర్యను ఎక్కువమంది ప్రజలు ప్రశంసిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నది. దీనికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుతోపాటు, పోలీసు బలగాలను, కూల్చివేతలకు అధునాతన యంత్రాలను సమకూర్చేపనిలో ఉంది.