“భారతదేశ విదేశాంగ విధానం క్రమంగా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల వైపు జారుతోందా? లేక అమెరికా భారత అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకుందా? అనే ప్రశనాలు తలెత్తుతున్నాయి. క్వాడ్ కూటమి, ఇండో-పసిఫిక్ వ్యూహం, చైనా వ్యతిరేక భద్రతా సమీకరణాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత వైఖరి ఇవన్నీ అమెరికా వ్యూహాలకు దగ్గరగా ఉన్నాయన్న అభిప్రాయం కొందరిలో బలపడుతోంది. అదే సమయంలో దేశీయ రాజకీయాల్లో కూడా అమెరికా దౌత్య చురుకుదనం పెరగడం అనేక అనుమానాలకు దారితీస్తోంది..”
దిల్లీ నుండి అస్సాం వరకు… ఆర్‌ఎస్‌ఎస్ వైఖరిలో మార్పు వరకు కనిపిస్తున్న కొత్త సంకేతాలు

సీనియర్ జర్నలిస్ట్,
మొబైల్ :939153339
భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ప్రభావం గత కొన్నేళ్లుగా ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు, వ్యూహాత్మక వర్గాల్లో బలపడుతోంది. ఒకప్పుడు కేవలం విదేశాంగ, రక్షణ, వాణిజ్య సంబంధాలకే పరిమితమైన అమెరికా ఆసక్తి, ఇప్పుడు భారతదేశ రాజకీయ వ్యవస్థ, రాష్ట్రాల రాజకీయాలు, మత-సామాజిక సమీకరణాలు, ఎన్నికల వాతావరణం వరకు విస్తరించిందా? అన్న ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఏ ప్రపంచ రాజకీయ కూటమిలో చేరకుండా, స్వంత బలంతో ప్రపంచ రాజకీయాలలో చక్రం తిప్పిన భారత దేశం ఇప్పుడు అమెరికా కనుసన్నల్లో వ్యవహరిస్తుందా అన్న ప్రశ్న, అనుమానం విశ్లేషకుల్లో తలెత్తుతుంది.
ఈ అనుమానాలకు కారణమైన పరిణామాలు కూడా సాధారణమైనవి కావు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన విక్రమ్ కుమార్ సక్సేనా కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సక్సేనా గతంలో అమెరికాలో ఇండియా దౌత్యాధికారిగా పని చేశాడు. భారత రాజ్యాంగ వ్యవస్థలో ఒక రాష్ట్ర పాలనా పదవికి అమెరికా అధ్యక్షుడు నేరుగా స్పందించడం అసాధారణ పరిణామంగా పలువురు విశ్లేషించారు.
అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో విజయం సాధించిన నేపథ్యంలో కూడా ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు, భారత ఎన్నికల రాజకీయాలపై అమెరికా ఆసక్తిని స్పష్టంగా చూపించాయని విమర్శకులు చెబుతున్నారు. కానీ అత్యంత సున్నితమైన పరిణామం అస్సాంలో జరిగింది. అమెరికా రాయబారి ఎరిక్ గసెట్టి (Eric Garcetti), అస్సాం ముఖ్యమంత్రిగా హిమాంత బిశ్వాస్ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం భారత స్వాతంత్ర్యానంతర చరిత్రలోనే అరుదైన ఘటనగా చెప్పబడుతోంది. ఒక విదేశీ రాయబారి, అది కూడా అమెరికా వంటి మహాశక్తికి చెందిన ప్రతినిధి, ఈశాన్య భారతదేశంలోని అత్యంత వ్యూహాత్మక రాష్ట్ర రాజకీయ కార్యక్రమానికి హాజరుకావడం సాధారణ దౌత్య మర్యాద కాదని విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకంటే అస్సాం, ఈశాన్య భారతం కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు అది భౌగోళిక రాజకీయంగా అత్యంత సున్నితమైన జోన్. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం దశాబ్దాలుగా తిరుగుబాట్లు, జాతి ఉద్యమాలు, విదేశీ మిషనరీల ప్రభావం, సరిహద్దు అక్రమ వలసలు, భద్రతా సమస్యలతో ముడిపడి ఉంది.
ప్రత్యేకంగా నాగాలాండ్, మిజోరం, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో క్రైస్తవ మిషనరీల ప్రభావం పెరిగిందని, గిరిజన సమాజాలపై పాశ్చాత్య మత-సాంస్కృతిక ప్రభావం తీవ్రమైందని ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వ వర్గాలు దశాబ్దాలుగా ఆరోపిస్తున్నాయి. అలాంటి ప్రాంతంలో అమెరికా దౌత్య చురుకుదనం పెరగడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది.
ఇటీవల ఉత్తర భారత రాష్ట్రాల్లో చోటుచేసుకున్న కొన్ని సామాజిక అల్లర్ల వెనుక విదేశీ నిఘా సంస్థల మద్దతు ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక అమెరికా పౌరుడిని భారత నిఘా సంస్థలు అరెస్ట్ చేసిన ఘటనను కొందరు దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. అధికారికంగా అన్ని వివరాలు బయటకు రాకపోయినా, “హైబ్రిడ్ వార్‌ఫేర్” యుగంలో విదేశీ శక్తులు ప్రత్యక్ష యుద్ధాలకంటే అంతర్గత అస్థిరత, మత-జాతి విభజనలు, డిజిటల్ ప్రచారం, సామాజిక ఉద్రిక్తతల ద్వారా ప్రభావం చూపే ప్రయత్నం చేస్తాయన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో తెలిసిన వాస్తవమే.
“ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వ భాషలో వచ్చిన మార్పులు మరింత ఆసక్తికరంగా మారాయి. అమెరికా, యూరప్ పర్యటనల అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబోలె, “భారత్ పాకిస్థాన్‌తో చర్చలు జరపాలి” అని చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీశాయి. దశాబ్దాలుగా పాకిస్థాన్ వ్యతిరేక జాతీయవాద రాజకీయాలను నడిపించిన సంస్థ నుంచి ఇలాంటి మృదువైన భాష రావడం సాధారణ విషయం కాదు..”
అమెరికా విదేశాంగ చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం, మానవహక్కులు, మత స్వేచ్ఛ పేరుతో రాజకీయ జోక్యాలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. లాటిన్ అమెరికా నుండి మధ్యప్రాచ్యం వరకు, ఆఫ్రికా నుండి ఆసియా వరకు అమెరికా జియోపాలిటికల్ జోక్యాలపై ఎన్నో చర్చలు జరిగాయి. ఇప్పుడు అదే నమూనా భారతదేశంలో కూడా కనిపిస్తోందా అన్న ప్రశ్న ముందుకు వస్తోంది.
ఇదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వ భాషలో వచ్చిన మార్పులు మరింత ఆసక్తికరంగా మారాయి. అమెరికా, యూరప్ పర్యటనల అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబోలె, “భారత్ పాకిస్థాన్‌తో చర్చలు జరపాలి” అని చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారితీశాయి. దశాబ్దాలుగా పాకిస్థాన్ వ్యతిరేక జాతీయవాద రాజకీయాలను నడిపించిన సంస్థ నుంచి ఇలాంటి మృదువైన భాష రావడం సాధారణ విషయం కాదు.
ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ సిద్ధాంతకర్త రామ్ మాధవ్ అమెరికాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భారత్ అమెరికా టారిఫ్ విధానాలు, చమురు కొనుగోలు అంశాల్లో అమెరికా సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తోందన్న భావన కలిగించే వ్యాఖ్యలు చేయడం. తరువాత ఆయన వివరణ ఇచ్చినా, ప్రతిపక్షాలు చేస్తున్న “మోదీ ప్రభుత్వం అమెరికా ముందు పూర్తిగా తలవంచింది” అన్న ఆరోపణలకు ఇవి మరింత బలం చేకూర్చాయి.
ప్రశ్న ఇప్పుడు మరింత స్పష్టంగా మారింది – భారతదేశ విదేశాంగ విధానం క్రమంగా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల వైపు జారుతోందా? లేక అమెరికా భారత అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకుందా? అనే ప్రశనాలు తలెత్తుతున్నాయి. క్వాడ్ కూటమి, ఇండో-పసిఫిక్ వ్యూహం, చైనా వ్యతిరేక భద్రతా సమీకరణాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత వైఖరి — ఇవన్నీ అమెరికా వ్యూహాలకు దగ్గరగా ఉన్నాయన్న అభిప్రాయం కొందరిలో బలపడుతోంది. అదే సమయంలో దేశీయ రాజకీయాల్లో కూడా అమెరికా దౌత్య చురుకుదనం పెరగడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
ఇక్కడ మరింత ప్రమాదకర అంశం ఏమిటంటే — విదేశీ ప్రభావాలు కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా, సిద్ధాంత సంస్థలు, మత-సామాజిక శక్తులు, మీడియా వర్గాలు, ఎన్నికల వాతావరణం వరకు విస్తరించే పరిస్థితి కనిపించడం. అస్సాం వంటి సున్నిత ప్రాంతాల్లో అమెరికా దౌత్య చలనం, ఈశాన్య ప్రాంతాల్లో మిషనరీల ప్రభావం, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వ భాషలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు ఇవన్నీ కలిపి చూస్తే భారత రాజకీయాల్లో ఒక కొత్త అంతర్జాతీయ ప్రభావ దశ ప్రారంభమవుతోందన్న భావనను కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరోవైపు జాగ్రత్త అవసరం కూడా ఉంది. ప్రతి అంతర్గత సమస్యను విదేశీ కుట్రగా చిత్రీకరించడం కూడా ప్రమాదకరం. కానీ అదే సమయంలో విదేశీ శక్తులు “సాఫ్ట్ పవర్”, “దౌత్య ప్రభావం”, “మత-సామాజిక నెట్‌వర్కులు”, “వ్యూహాత్మక భాగస్వామ్యాలు” పేరుతో దేశాల అంతర్గత వ్యవస్థలపై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తాయన్నది కూడా ప్రపంచ రాజకీయాల్లో కొత్త విషయం కాదు.
భారతదేశం ఇప్పుడు ప్రపంచ శక్తి సమీకరణాల్లో కీలక కేంద్రంగా మారుతోంది. అలాంటి సమయంలో అమెరికా వంటి దేశాలు భారత రాజకీయాలు, భద్రతా వ్యూహాలు, సామాజిక సమీకరణాలపై ఆసక్తి చూపడం సహజమే. కానీ ఆ ఆసక్తి ఎక్కడ దౌత్య సంబంధంగా ముగుస్తుంది? ఎక్కడ జోక్యంగా మారుతుంది? అన్నదే అసలు ఆందోళన.
ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న ప్రశ్న కూడా అదే – భారతదేశం అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేస్తోందా? లేక క్రమంగా అమెరికా ప్రభావ వలయంలోకి జారిపోతోందా? దీనివల్ల భారతదేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు.




