బండి భగీరథ్ కేసులో విభిన్న కోణాలు!?

“రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి చట్టం తమ పని తాము చేసుకుపోతుంది అని చెప్పడం ద్వారా ఈ మొత్తం సంఘటన లో ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో తెలియదు గానీ, సమస్య బిజెపి పార్టీ కి సంభందించిన ప్రముఖ కుటుంబంది అయితే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తీరు వలన ఆ పార్టీకి కలిగే రాజకీయ నష్టం ఎక్కువగా ఉంది.”

ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త) 
సెల్:9441864514.

 

“కంచే చేను మేస్తే కాపేమి చేయును”అనే ఓ ముతకసామెత ఉండేది. బండి భగీరథి కేసులో కనిపిస్తున్న భిన్న కోణాలు,విభిన్న కథనాలు దాన్నే రుజువు చేస్తున్నాయి.మన చట్టాలు అనేవి అధికారం ఉన్నవాళ్ళకు చుట్టాలని,అదే సామాన్యులు విషయానికి వస్తే కష్టాలని మరోమారు నిరూపితం అయ్యింది.బాధితులకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలోని చట్టంలో చిల్లులు వెతికి నిందితులను బయటపడేలా చూస్తున్నప్పుడు ఎవరేమి చేయగలుగుతారు.వ్యవస్థ అవస్థను చూసి ఒకవైపు జాలి,మరోవైపు సిగ్గుపడడం తప్ప!

   తెలంగాణా సమాజం లో అసలు బండి సంజయ్  ఓ విలక్షణమైన రాజకీయ ప్రతినిధి. పొగ లేకుండా నిప్పు పుట్టించే సమర్థత ఉన్న నేత! అంతేకాదు,పురాతన శకలాలు కూడా తవ్వి శవాలు,శివాలు పుట్టించగల ప్రచార వైవిద్యత కలనేత! మాటల మాంత్రికుడు..అందుకే తెలంగాణా రాష్ట్రం లో ఎందరు సీనియర్ నేతలు ఉన్నా,ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరసన హోంశాఖ సహయ మంత్రిగా అవకాశం కల్పించింది కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం.ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి తండ్రి కంటే ఆయన కొడుకు రెండాకులు ఎక్కువే చదివినట్లు అర్థం అవుతుంది. 25ఏళ్ళ వయస్సు లోనే ఆయన కొడుకు పోక్సో కేసులో ఇరుక్కోవడం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు అదో మింగుడు పడని నైతిక సమస్యగా మారడం విశేషం..!ఆ మాటకొస్తే ఇప్పటి సామాజిక పరిస్థితులే దిగజారుతున్న కుటుంబ, మానవ సంబంధాలకు అద్దం పడుతుంది.
    అంతేకాదు,ఉన్నత వర్గాలు, అధికారం చేతిలో ఉన్న పెద్ద పిల్లలు ఇట్లాంటి విషయాలలో ఓ అడుగు ముందు ఉన్నారు.డ్రగ్స్ నుండి పబ్బులు, లైంగిక వేధింపులు వరకు అది సాధారణ విషయంగా మారింది. చేతి నిండాడబ్బు, అధికారం,హోదా ఉన్న కుటుంబాల పిల్లలు నేరస్థ ప్రపంచం లో కూడా అదే స్థాయిలో ముందు ఉంటున్నారు.వారాంతాలు ,రిసార్డులు,బైకు రేసులు, పబ్బులు,ఫాంహౌస్ లు విలాసం కేంద్రాలుగా మారాయి. వాళ్ళలో నెలకొంటున్న అధికారం,ఆహం ఎంతటి నేరమైనా ఏమౌతుంది లే అన్నా ధీమాతో ఉన్నట్లు వివిధ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.ఇలాంటి సంఘటనలు బహిర్గతం అయినవాటి కంటే, కానివి అనేకం జరుగుతున్నప్పటికీ కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి కుమారుడు బండిబగీరధ ప్రవర్తన,ఆయనపై నమోదైన కేసులు సరికొత్త సూచికలుగా మారాయి.
    తోటకూరనాడే మందలించి ఉంటే ఇక్కడి దాకా ఎందుకు వస్తుంది అనేది ఓ తెలంగాణా  సామెత. బండిభగీరద ప్రవర్తనపై గతంలో నే అనేక విషయాలు బహిర్గతం అయినప్పటికీ వాటిని నియంత్రించాల్సిన యంత్రాంగం, కుటుంబం సీరియస్ గా తీసుకొనక పోవడం కూడా తాజా సంఘటన లకు ఆజ్యం పోసింది అని చెప్పవచ్చును.ఒకరకంగా ఈ పరిణామం నిందితుడు కుటుంబం కే కాదు మొత్తం సమాజమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.విష సంస్కృతి నుండి జాగ్రత్త పడాల్సిన ప్రదాన విషయ సూచికగా ముందుకు వస్తుంది.
   బండి భగీరద్, ఓ మైనర్ బాలిక పట్ల వ్యవహరించిన తీరు నిజంగా సభ్యసమాజం తలదించుకునే దిశగానే ఉంది.ఒకరకంగా ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే తెలంగాణా రాష్ట్రం లో తేరుకునే స్థితిలో ఉన్న బిజెపి పార్టీని కార్నర్ లో పడేయగా, అధికారపక్షం కాంగ్రెస్ కు అంతకంటే ఎక్కువ నష్టం చేసిందని చెప్పవచ్చును.కేసు రీత్యా బహిర్గతం అవుతున్న విషయాలను బట్టి ఈ అమానుష కాండలో సింహ భాగం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పుత్రుడు బండి భగీరథి దే అయినా” తిలాపాపం తలా పిడికెడు “అన్నవిధంగా అంటుకొంది.ఎందుకంటే నిందితుడి తండ్రి కేంద్ర హోం మంత్రి కావడం,ఆ కేసును నడపడంలో హోంమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానపాత్ర కావడం దాని ప్రాధాన్యత,పర్యావసానాలు కార్యాకారకాలు ప్రజల దృష్టి ని మరింత ఆకర్షించాయని చెప్పక తప్పదు.వివిధ రాష్ట్ర లలో ఇలాంటి మానభంగం కేసులే అనేకం బహిర్గతం అయి చర్చ నడుస్తుండగా,ఓ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కేసులో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఇంతవరకు పెద్దగా స్పందించకపోవడం చాలా చిత్రమైన విషయం.
     ఓ మైనర్ బాలిక విషయం లో జరిగిన ఓ అమానుష సంఘటన బయటకు చెప్పుకోవడమే చాలా బాధాకరం అయితే ఓ కేంద్ర మంత్రి కొడుకు దుశ్చర్యల పై ఓ సాధారణ  కుటుంబం గత్యంతరం లేని స్థితిలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం అక్కడ ఎదురైన సంఘటనలు సగటు భారతీయ పౌరుడు అనుమానించేలా,వర్గ సమాజంలో చట్టం వర్గ న్యాయం కు ఎలా దిగుతుందో ఈ సంఘటన బహిర్గతం చేసింది.బాధిత బాలిక పేట్ బషీర్ బాగ్ స్టేషన్లో పిర్యాదు కు వెళ్ళినప్పుడు సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంటల వరకు ఫిర్యాదు తీసుకొనక పోవడం,రాసిన ఫిర్యాదు పదే పదే మార్చడం,రక్షణ కల్పించాల్సిన పోలీసులు రాజీ మార్గాలు సూచించడం,చివరకు బాలిక తల్లి కేసు నమోదు చేయకపోతే ప్రధాని మోదీ సభలో ఆత్మార్పణ చేసుకుంటాం అనే వరకు వెళ్ళడం మన ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ ప్రజలకు కాకుండా రాజకీయ నేతలకు ఊడిగం చేసే విధానం ఎలా ఉందో మరోమారు బహిర్గతం అయింది.    అంతేకాదు, బాధితుల పైనే కరీంనగర్ సీపీ ఆధ్వర్యంలో ఓ నాన్ బెయిలబుల్ కేసు ‘హనీట్రాఫ్ ‘పేరుతోనమోదు చేయించి బాధిత కుటుంబం ను బెదిరించాడనికి తోడ్పడడం ఈ వ్యవస్థ లో ఉన్న డొల్ల తానాన్ని బహిర్గతం చేస్తుంది.ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించిన సంగప్ప కూడా పోక్సో కేసు విచారణ అర్హుడే కాదు శిక్షార్హుడు కూడా..!ఇదిలా ఉండగా బండి భగీరథి ఫోక్సో కేసులో తన పేరును ఎక్కడా వాడవద్దని సిటీ సివిల్ కోర్టు నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉత్తర్వులు తేవడం అనేది ఆయనకు ఆయనే ప్రతిష్ట దిగజార్చుకునేదిగా ఉంది.కాదన్నంత మాత్రాన బంధాలు,అనుబంధాలు తెగిపోతాయా?
   పబ్లిక్ లో నిలబడిన వ్యక్తి ఎంతటివారైనా ప్రజలు ప్రశ్నించడమే ప్రజాస్వామ్య ప్రాధమిక సూత్రం..ఎట్టకేలకు బషీర్ బాగ్ స్టేషన్లో నమోదయిన పోక్సో కేసులో కూడా బెయిలబుల్ కేసు నమోదు కావడం చాలా విచిత్ర మైన విషయం.గతంలో దిశ కేసులో నలుగురు బలహీన వర్గాల పిల్లలను పోలీసులు సీన్ కన్స్ట్రక్షన్ పేరుతో ఎన్కౌంటర్ చేసిన సంఘటన చూశాం.అదే సజ్జనార్ ఇప్పుడు కీలక స్థానం లో ఉన్న స్థితిలో కూడా నమోదైన ఈ పోక్సోకేసు కొత్త పుంతలు తొక్కింది.వర్గ సమాజంలో వర్గం న్యాయం అమలౌతుందని స్పష్టం అవుతుంది.  ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి నాలుగైదు సార్లు అపార్టుమెంట్లు, ఫాంహౌస్ లకు తీసుకెళ్లి లైంగిక హింసలకు పాల్పడిన సంఘటన చిన్నదేమీ కాదు.పైగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న భగీరథి సన్ ఆఫ్ హోంశాఖ సహాయ మంత్రి కూడా ఆ మైనర్ బాలిక పట్ల సంఘటనలో అనుసరించిన తీరు అంత బాగాలేదు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి చట్టం తమ పని తాము చేసుకుపోతుంది అని చెప్పడం ద్వారా ఈ మొత్తం సంఘటన లో  ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో తెలియదు గానీ, సమస్య బిజెపి పార్టీ కి సంభందించిన ప్రముఖ కుటుంబంది అయితే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తీరు వలన ఆ పార్టీకి కలిగే రాజకీయ నష్టం ఎక్కువగా ఉంది.వాస్తవంగా క్రిమినల్ కేసులు నమోదైన రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ కి అనుమతించడమే తప్పు!వారే కీలక స్థానాల్లో ఉన్నప్పుడు బాధితులకు ఇంతకంటే ఆశించిన న్యాయం అందుతుందను కోవడం పొరపాటే అవుతుంది”గొంగట్లో అన్నంతింటు వెంట్రుకలు వెతికి నట్లు “ఉంటుంది.
     ప్రజాందోళన,మైనర్ బాలిక తో పోలీసు అధికారులు మాట్లాడిన తర్వాత సిట్ అధికారులు కేసును నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా మార్చి నమోదు చేసినప్పటికీ,ఆధారాలు దొరకందే అరెస్టు చేయలేమని విచారణ అధికారి ప్రకటించడం, అరెస్టు జాప్యం ద్వారా కొన్ని కీలక ఆధారాలు మాయం అయ్యే అవకాశం తో పాటు,కేసునీరుకారే అవకాశం కూడా ఉంది..న్యాయ స్థానంలో బాధిత బాలిక మైనారిటీ కాదనే వాదన రావడానికి ప్రధాన కారణం ఎప్పుడో 2021లో చెల్లించిన పోలీసు చలానా ‘ఎలిజీ’గా ప్రత్యర్థులు చూపడం అనేది ఆ శాఖ సహకారం లేకుండా బయటకు రాదు.సహజంగా మైనర్లు బండి నడుపుతున్నప్పుడు పోలీసులు పట్టుకున్న సందర్భంలో బయటపడడానికి ఏదో ఒక వయస్సు చెబుతుంటారు .కాస్తా వయస్సు పెంచి కూడా చెబుతారు..ఇది సహజంగా జరిగే ప్రక్రియ.చలానా సమయంలోకూడా వయస్సు ఖచ్చితంగా నిర్థారించాలసింది పోలీసు వ్యవస్థనే! వాళ్ళు చేసిన తప్పును ఎత్తిచూపి బాలిక మైనర్ కాదు అని నిర్ధారించే ప్రయత్నం లో అర్థం లేదు.
అసలు వయస్సు నిర్థారణ కు ప్రామాణికంగా ఉన్న యస్ ఎస్సీ సర్టిఫికెట్, కార్పొరేషన్ బర్త్ సర్టిఫికెట్ కదా పరిగణలోనికి తీసుకోవాల్సింది.ఒకవేళ బాలిక మైనర్ కాదని నిరూపించే ప్రయత్నం ద్వారా,ఇలాంటి సంఘటనలు సహజం అని చెప్పాడం ద్వారా చేసిన దుష్క్రత్యం కప్పి పెట్టుకోలేరు కదా!  కేసు నమోదు నుండి అరెస్టు వరకు , న్యాయస్థానం లో వాదనలు వరకు పోలీసు వైఫల్యం, ఉదాసీనత ఈకేసులో స్పష్టంగా కనిపిస్తుంది.బాధిత కుటుంబం కంటే నిందితుడుగా ఆరోపించిన వ్యక్తిని కాపాడే ప్రయత్నంనే ఎక్కువ గా కనిపించింది.మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వారు ఒకే కులం కనుక పంచాయితీ జరుపుకోండి లాంటి చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం కు ఉదాహరణగా నిలిచింది. చాలా చిత్రంగా రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రతిపక్ష పార్టీ పాత్రను నిర్వర్తించక పోవడం వలన ఆ మైలేజీకాస్తా బీఆర్ ఎస్  ఖాతాలో జమైంది.వామపక్షాలతో పాటు, తెలంగాణా వాదులు,సోషల్ మీడియా,సాధారణ జనం కూడా స్పందించడం వలన ఎంతోకొంత సంఘటన తీవ్రత ప్రజలకు అర్థం అయ్యింది..! ఇట్లాంటి వ్యవహారాల లో జరిగిన విషయం బయటకు చెప్పుకోడానికి ఇబ్బంది పడే కాలంలో,నిజంగా ఈ కేసులో బాధితురాలి తల్లి చూపిన తెగింపు కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
    ఈ కేసులో నిందితుడిగా ఆరోపించిన వ్యక్తి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా ఉన్నందున నైతిక ప్రమాణాలు పాటిస్తే ఆ పదవికి రాజీనామా చేసి తమ కుటుంబం మీద, కుమారుడు మీద నమోదైన కేసును ఎదుర్కోవాలి.నిర్థోషిత్వం నిరూపించుకోవాలి.అది మాత్రమే ఆయనకు నైతికత అవుతుంది.పదవిలో ఉండి కేసును ఎదుర్కోవడం అంటే ప్రజలు, రాజ్యాంగ చట్టాలను అపహాస్యం చేసినట్లే అవుతుంది..!రాష్ట, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనత చూపడం ద్వారా చట్టం పట్ల, దర్యాప్తు సంస్థల పట్ల,న్యాయస్థానాల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.ఒకవేళ అదే జరిగితే ఏదో ఒక రోజు ప్రజల తిరుగుబాటు వెల్లువలా ముంచెత్తే అవకాశం ఉంది.బాధిత కుటుంబం కు న్యాయం తో పాటు, ఇలాంటి సంఘటనల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *