జార్ఖండ్‌లో చొరబాటుదారులను ఏరివేస్తాం..

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే
పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం
జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

రాంచీ, నవంబర్‌ 04 : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చాయిబసలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌్‌లో కాంగ్రెస్‌, ఆర్జేడీ ఆదివాసీలపై అనాగరిక నేరాలకు పాల్పడ్డాయని ధ్వజమెత్తారు. ఆనాడు జార్ఖండ్‌ ఏర్పాటును ఆర్జేడీ వ్యతిరేకించిందన్న ప్రధాని.. ఇప్పుడు జేఎంఎం దాని ఒళ్లో కూర్చొందంటూ చురకలంటించారు. ఈ సారి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకొని చరిత్ర లిఖిస్తామని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

జార్ఖండ్‌ లో భాజపా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చొరబాటుదారులను అడ్డుకొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హా ఇచ్చారు. అక్రమంగా లాక్కున్న భూమిని తిరిగి ఆదివాసీ మహిళల పేర్లపై బదలాయించేలా చట్టాన్ని తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి వోటు బ్యాంకుకు అప్పగించేందుకు చూస్తోందని, వోటు బ్యాంకు కోసం జార్ఖండ్‌ జనాభా మార్చే విషయంలో జేఎంఎం-కాంగ్రెస్‌ కుట్రలు చేస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. పదేళ్లలో పేదల కోసం అమలుచేసిన పథకాలతో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. జార?ండ్‌లో పేదరిక నిర్మూలనకు భాజపా కట్టుబడి ఉందన్నారు.

ఎన్డీయే కూటమి ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలోని ఛాయ్‌బస పట్టణంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజన సోదర, సోదరీమణుల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ఏవిధంగా పనిచేస్తోందో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక కేంద్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు గిరిజన సమాజం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ప్రస్తావించారు. తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు గిరిజనుల కోసం రాష్ట్రాన్ని ఇచ్చామని అన్నారు. దిల్లీ నుంచి పని చేసే అవకాశం అటల్‌ బిహారీ వాజ్‌పేయికి దక్కిందని, ఆయన హయాంలోనే గిరిజన రాష్ట్రాలు ఏర్పడ్డాయని మోదీ గుర్తుచేశారు.

ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వాజ్‌పేయి హయాంలోనే ఏర్పాటు అయ్యాయని మోదీ చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ధరలు తగ్గించేందుకు కృషి చేస్తామని, ఇక చట్ట విరుద్ధంగా గిరిజన కూతుళ్ల నుంచి గుంజుకున్న భూములను వెనక్కి ఇప్పిస్తామన్నారు. జార్ఖండ్‌ గుర్తింపు మార్చివేసే కుట్ర జరుగుతోందని మోదీ అన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారులకు జేఎంఎం-కాంగ్రెస్‌- ఆర్జేడీ మద్దతిస్తున్నాయని అన్నారు. చొరబాటుదారులే వారి అతిపెద్ద వోటు బ్యాంక్‌. జేఎంఎం, కాంగ్రెస్‌ పార్టీలు చొరబాటుదారుల కోసం ఫేక్‌ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నాయి. ఆడ కూతుళ్ల నోటి కాడా కూడు, భూమి లాక్కుంటున్నారు.

అంతేకాదు జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్లను ప్రకటిస్తున్నాయి. ఈ విద్యా సంస్థల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీల రిజర్వేషన్లకు ముగింపు పలుకుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే సీతా సోరెన్‌ను అవమానించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ దేశంలోని మహిళలను కించపరిచిందన్నారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువతను రిక్రూట్‌మెంట్‌ మాఫియాకు అప్పగించి.. పేపర్‌ లీక్‌లతో వారి భవిష్యత్తు నాశనం చేస్తోందని మోదీ మండిపడ్డారు. ఆదివాసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్‌ ఆలోచించలేదని.. ఈ పని ఎన్డీయే చేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page