వొచ్చే వారం రోజులు ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీలు
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎండల తీవ్రత పెరగనుంది. భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
రాజధాని హైదరాబాద్‌లో కూడా వొచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. ఉదయం నుంచే ఎండలు మండిపోగా, మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
వాతావరణ నిపుణుల ప్రకారం బంగాళాఖాతంలో తేమ గాలులు బలహీనపడటం, పొడి గాలులు తెలంగాణ వైపు వీచడం వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మే చివరి వారానికి ముందుగా గణనీయమైన వర్షాలు వొచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే జూన్ తొలి వారంలో దక్షిణ పశ్చిమ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది.
ఇక ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని సూచించింది. ఎక్కువగా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
వచ్చే వారం అంచనా ఉష్ణోగ్రతలు (సగటు):
- హైదరాబాద్ : 40-42°C
- నిజామాబాద్ : 43-44°C
- ఆదిలాబాద్ : 43°C
- కరీంనగర్ : 42-43°C
- వరంగల్ : 41-42°C
- ఖమ్మం : 40-41°C
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. మధ్యాహ్న వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలపై అధికారులు అప్రమత్తమయ్యారు.





