తైవాన్‌పై మాట మార్చిన ట్రంప్

– చైనా పర్యటన తరవాత వైఖరిలో మార్పు

వాషింగ్టన్, మే 16: తైవాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ‘తైవాన్ అంశం క్లిష్టమైన సమస్యే.. ఈ ద్వీపం చైనాకు కేవలం 95 కి.మీ దూరంలో ఉండగా అమెరికాకు మాత్రం 15 వేల కి.మీ కు పైగా దూరంలో ఉంది.. అంతదూరం  మేం వేగంగా స్పందించడం కష్టమే.. చైనా చాలా శక్తిమంతమైన, పెద్ద దేశం కూడా.. ఉద్రిక్తతల విషయంలో చైనా, తైవాన్‌లు సంయమనం పాటించాలి’ అని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు. చైనా పర్యటన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అమెరికా`చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని ట్రంప్‌నకు జిన్‌పింగ్ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తైవాన్ జలసంధి అంతటా శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడమే ఇరు దేశాల మధ్య ఉన్న అతిపెద్ద విషయమన్నారు. అమెరికా` చైనాలు భాగస్వామ్య దేశాలుగా ఉండాలే తప్ప ప్రత్యర్థులుగా కాదని అన్నారు. తైవాన్‌ను తనలో పూర్తిగా విలీనం చేసుకోవాలని చైనా కోరుకుంటోంది. తైవాన్ స్వాతంత్య్రాన్ని అమెరికా బహిరంగంగా వ్యతిరేకించాలన్నది చైనా వాదన. తైవాన్ విషయంలో చైనా ఏకపక్ష చర్యలకు దిగరాదు అని ఇంతకాలం అమెరికా స్పష్టం చేస్తూ వచ్చింది. దానికి భిన్నంగా ఇప్ప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించాలా, వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడం ఆయన వైఖరిలో మార్పును వెల్లడిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *