మార్కెట్లో అడుగుడుగునా మోసాలతో చిత్తు
•దలారుల వలలో చిక్కి రైతుల విలవిల
•చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం..
జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్ 4: ‘‘ప్రతి ఏటా వ్యవసాయ సీజన్ వొస్తుందంటే చాలు.. మండల రైతాంగం పత్తి పంటపై ఎన్నో ఆశలు పెంచుకుంటోంది. ఒక్కోసారి కాలం కలిసిరాక అప్పుల పాలై పత్తి రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. పత్తి పండించడానికి భార్యా పిల్లలతో సహా అందరూ ఆరుగాలం శ్రమిస్తారు. తీరా పంట చేతికి వొచ్చాక అమ్మి సొమ్ము చేసుకునే ఆలోచన చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న దళారీలు మాయమాటలతో తారసపడతారు. అసలే బక్కచిక్కిన పత్తి రైతు దళారీ విసిరిన తారం, తూకం, మోసం వంటి వలలో చిక్కి విలవిలలాడిపోతున్నాడు. ఇది పత్తి రైతు వ్యథ. ఇది ఈనాటిది కాదు.. ఏటా ఇది సర్వసాధారణమైపోయింది. ఇంత జరుగుతున్నా దళారీల బెడద నుంచి పత్తి రైతును కాపాడాల్సిన యంత్రాంగం మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
పర్యవసానంగా పత్తి కొనుగోళ్లలో అక్రమాలు మూడు పూలు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది’’
ఖమ్మం జిల్లా పరిధిలోని ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని జూలూరుపాడు మండల కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉప మార్కెట్ యార్డులో గత 30 ఏళ్లుగా పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. జూలూరుపాడులోని తాత్కాలిక ఉప మార్కెట్ యార్డు అసలు ప్రభుత్వ రికార్డులోనే లేదు. ఇక్కడ పత్తి కొనుగోళ్ల నిర్వహణ అంతా ప్రైవేటు వ్యాపారుల కనుసన్నల్లోనే జరుగుతుంది. కొనుగోళ్లపై ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పర్యవేక్షణ ఉందని చెబుతున్నా.. అది నామ మాత్రమేనని రైతాంగం చెబుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో పెద్ద మొత్తంలో జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు జరుగుతుంటాయి.
తెల్లవారకముందు నుంచే దూర ప్రాంతాల నుంచి రైతులు ఆటోలు, ట్రాక్టర్లతో తమ పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ కు తీసుకొస్తారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, కామేపల్లి, కొణిజర్ల, మధిర, ఎర్రుపాలెం, పెనుబల్లి మండలాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి, ఇల్లందు, పాల్వంచ, గుండాల, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల నుంచి రైతులు పండించిన పత్తిని జూలూరుపాడు మార్కెట్లో అమ్ముకుంటారు. ఉమ్మడి జిల్లాతో పాటు సరిహద్దు ఆంధ్ర రాష్ట్రంలోని నందిగామ, తిరువూరు, గంపలగూడెం పలు మండలాలకు చెందిన రైతులు కూడా ఇక్కడి మార్కెట్ కు వస్తుంటారు. దీంతో ఉదయం నుంచే రైతులతో పాటు, వాహనాలతో మార్కెట్ నిత్యం రద్దీగా మారుతోంది. ప్రతిరోజు ఉదయాన్నే పత్తి కొనుగోలు కోసం జెండా పాట నిర్వహిస్తారు. ఒకవైపు పత్తి కొనుగోలు జరుగుతుండగానే మరోవైపు లారీలకు పత్తిని లోడ్ చేసి వ్యాపారులు ఎగుమతులు చేస్తుంటారు. ఇక్కడ మార్కెట్లో కొనుగోలు జరిగిన పత్తిని వరంగల్, మహబూబాద్, భువనగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోని పత్తి జిన్నింగ్ మిల్లులతోపాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ప్రతిరోజు పత్తి ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం జూలూరుపాడు మార్కెట్ యార్డ్ లో రోజుకు 1500 క్వింటాళ్ల మేర కొనుగోలు జరుగుతోంది.
పత్తి కొనుగోలు కోసం ఉదయాన్నే రోజు నిర్వహిస్తున్న జెండాపాట ధర ప్రకటనకు మాత్రమే పరిమితమవుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్లోకి రాక ముందే కొంతమంది ట్రేడర్స్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు పత్తి లోడుతో ఉన్న వాహనం వద్దకు పరుగులు పెట్టి వొస్తుంటారు. ఒక్కోసారి వాహనాన్ని చుట్టుముట్టేస్తారు. ఎవరికి వారే పత్తిని చూసి నాణ్యతను పరిశీలించుకుంటారు. ఓ రేటు నిర్ణయించాక వ్యాపారి కొనుగోలు కేంద్రం వొద్దకు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లాక తేమ పేరుతో ధరలో కోత పెడతారు. పత్తిలో 8 శాతం వరకు మాత్రమే తేమ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర రూ 7521 లు ప్రకటించింది. రోజు జెండాపాట మాత్రం క్వింటా ధర రూ 6600లు మాత్రమే ఉంటుంది.
వర్షాలు ఇటీవల రోజు కురుస్తుండడం, ఇదే సమయంలో పత్తిని మార్కెట్కు తీసుకువస్తుండటంతో దళారులకు ఇది అవకాశంగా మారింది. ఈ కారణం చూపుతూ తేమ పేరుతో క్వింటా రూ 5500 లు కంటే ఎక్కువ కొనుగోలు చేయడం లేదు. తారం పేరుతో, తూకంలో తగ్గింపులు చేస్తున్నారు. ఇంతేగాక మండల కేంద్రంలో ఉన్న కొన్ని కాంటాల వద్ద తూకాల్లో కూడా తేడాలు వస్తున్నట్లు చాలాసార్లు రైతులకు, కాంట నిర్వాహకులకు మధ్య గొడవలు జరిగాయి. అడుగడుగునా పత్తి రైతు మోసపోతున్నా కానీ బాధ్యత కలిగిన యంత్రాంగం మాత్రం ఇదంతా సహజమేనంటూ తేలిగ్గా తీసుకుంటుంది. పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖతోపాటు రెవెన్యూశాఖ, తూనికలు కొలతలశాఖల నిరంతర పర్యవేక్షణ ఉండాలి. దీంతోపాటు ప్రభుత్వానికి ఆదాయ వనరు అయిన సేల్ టాక్స్, కమర్షియల్ టాక్స్, ఇన్‌కం టాక్స్ వంటి పలు విభాగాలు కోట్లలో జరుగుతున్న పత్తి కొనుగోళ్ల వ్యాపారంపై నిరంతర నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డులో జరుగుతున్న పత్తి కొనుగోళ్లపై నిఘా కొరవడటంతో పత్తి రైతులు మోసపోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పత్తి కొనుగోళ్లపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.