కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి

– ప్రతీ ఒక్కరిలో అదే ఆలోచన
– ‘సర్ ’లో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలి
– సనత్‌నగర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : సాధారణంగా జరిగే ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమం(ఎస్ ఐ ఆర్)పై బీజేపీ అనేక వివాదాలు సృష్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఓటర్లను, వారి మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ఈ  ఎస్ఐఆర్ ను అడ్డగోలుగా వినియోగించడం వంటి అనేక ఆరోపణలున్నాయన్నారు.  ఎస్ఐఆర్  పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేనే లేదని, కేవలం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వచ్చిన గాలి గత్తర వల్ల కొంత కనిపిస్తున్నదని, సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ ఉన్న పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉన్నదని కేటీఆర్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ను పక్కనపెట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న ఎసఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ఎంపిక చేసిన బూత్ లెవెల్ అసిస్టెంట్లతో కూడిన ఈ సమావేశంలో కేటీఆర్ వారికి దానిపై దిశానిర్దేశం చేశారు. తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఓటర్లను, వారి మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ‘సర్’ను అడ్డగోలుగా వినియోగించడం వంటి అనేక ఆరోపణలను అటు బీహార్, బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో ఎదుర్కొన్నదన్నారు. కానీ, తెలంగాణలో బీజేపీ ఆటలు సాగకుండా, ఆ పార్టీ అరాచకాలు నడవకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లు, బీఎల్ఏలు ఒక్కరి ఓటును కూడా అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కలిసి తొలగించకుండా కాపాడాలని సూచించారు. ఇందుకోసం ఎ స్ఐఆర్ ప్రక్రియ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అవసరమైతే దీనికోసం మరోసారి  బీఎల్ఏ లకు పార్టీ తరఫున శిక్షణా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు. ఒకరిపై ఒకరిని ఉసిగొల్పాలన్న ఆలోచనలోనే బీజేపీ ఎప్పుడూ ఉంటుందన్నారు. గతంలో కూడా ఎస్ఐఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్‌కు పార్టీ తరఫున లేఖ రాయగా ఆ తర్వాత ఎన్నికల కమిషన్ పార్టీ ప్రతినిధుల బృందాన్ని స్వయంగా ఆహ్వానించిందని తెలిపారు. ఆ సందర్భంగా ఎసఐఆర్‌ను అత్యంత పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా, ఎవరికీ లాభం కలగకుండా నిర్వహించాలని సూచించామని కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి తొలగించేలా చూడాలన్నారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల వ్యవహారం వల్లనే జూబ్లీహిల్స్‌లో ఎదురైన ఇబ్బందులను, ఓటమిని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తాగునీటి సరఫరా కూడా నిర్వహించలేని కాంగ్రెస్ 

ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలో చేస్తున్న కూల్చివేతలను ప్రస్తావించారు. హైదరాబాద్ లో కనీసం తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ వంటి అంశాలను కూడా నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపామని, అందుకే నగర ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తిగా మన పార్టీకే మద్దతు ఇచ్చారని అన్నారు. రానున్న రోజుల్లోనూ ప్రజలు మన పార్టీ గతంలో చేసిన అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మరోసారి అవకాశం ఇస్తారని కేటీఆర్ భరోసా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి పార్టీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ముందుకు పోతున్నారని, ఆయన రాజకీయాలతోపాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపిన తీరుపైన కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అందరికన్నా ముందుగా ఎస్ఐఆర్‌పై పకడ్బందీగా నిర్వహించిన కార్యక్రమం పట్ల అభినందించారు. కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జిలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు.  కార్పొరేటర్ ఆశావాహులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్, బీజేపీల ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టాలన్నారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, కంటోన్మెంట్ బోర్డ్ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

సైక్లిస్ట్ రమ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేటీఆర్ 

ఒక చిన్న సాయం ఒకరి జీవిత గమనాన్నే మార్చేస్తుంది. నల్గొండ జిల్లా కంచనపల్లికి చెందిన యువ సైక్లిస్ట్ రమ్య సైదులు ఎన్నో కష్టాల మధ్య పెరిగింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. అయినప్పటికీ ఈ సవాళ్లు ఆమె ఆశయాలను అణచివేయలేకపోయాయి, పైగా ఆమె సంకల్పాన్ని మరింత బలోపేతం చేశాయి. సైక్లింగ్‌పై ఉన్న విపరీతమైన మక్కువతో, రమ్య అలుపెరగకుండా శ్రమిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటానికి అవసరమైన ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్ ధర దాదాపు ₹10 లక్షలు ఉండటంతో అంత పెద్ద మొత్తాన్ని భరించడం ఆమె కుటుంబానికి సాధ్యం కాలేదు. సాయం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడా సరైన స్పందన లభించలేదు. అలాంటి  పరిస్థితుల్లో ఆమెకు ఒక ఆశాకిరణం కనిపించింది. డాక్టర్స్ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రమ్య.. అక్కడ ఒక సాధారణ అభ్యర్థనను ముందుకు తెచ్చింది. తన కలల ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రొఫెషనల్-గ్రేడ్ సైకిల్ కావాలని కోరింది. ఆమె పట్టుదల, స్పష్టమైన లక్ష్యాన్ని చూసి చలించిన కేటీఆర్ఆ మెకు ఖచ్చితంగా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అది మాటలకే పరిమితం కాలేదు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. కేటీఆర్ ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్  కార్యక్రమం స్పూర్తితో అలాగే అదే జిల్లాకు చెందిన వారైన డాక్టర్ శ్రీ రెడ్డి ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు. హెర్మియోన్ డన్కన్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రమ్యకు ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్‌ను అందజేశారు. ఈ రోజు రమ్య వెనుక నిలిచింది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఒక బలమైన నమ్మకం. ఒక నాయకుడి భరోసా, ఒక శ్రేయోభిలాషి మద్దతు, సమాజం అందించిన ధైర్యంతో ఆమె ఇప్పుడు సరికొత్త ఆత్మవిశ్వాసంతో తన లక్ష్యం వైపు దూసుకుపోతోంది. ఈ చిన్న సాయం వెనుక ఒక గొప్ప సందేశం దాగి ఉంది. సమాజంలో సాయం అనేది ఎక్కడో దూరంగా ఉండకూడదని, ఒక వ్యక్తి ముందుకు వస్తే మరొకరి కలను నిజం చేయవచ్చని నిరూపించింది. రమ్యకు ఈ విధంగా మద్దతుగా నిలవడం ద్వారా, నాయకత్వం అనేది పదవుల్లో మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ప్రజల పక్షాన నిలబడటంలోనే ఉందని కేటీఆర్ మరోసారి చాటి చెప్పారు. యువతకు కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు: మీరు స్వేచ్ఛగా కలలు కనండి.. వాటి కోసం పట్టుదలగా శ్రమించండి.. ఎందుకంటే మీ కష్టానికి సరైన మద్దతు తోడైనప్పుడు ఆ కలలు ఖచ్చితంగా నిజమవుతాయి’ అని.

‘నీట్‌’ లీకేజీపై 20న రౌండ్ టేబుల్ సమావేశం :  కేటీఆర్‌కు ఆహ్వానం

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ‘నీట్‌’ పేపర్ లీకేజీ అంశంపై లెఫ్ట్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న హైదరాబాద్‌లో తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను లెఫ్ట్ విద్యార్థి సంఘాల ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగ బాలు సమన్వయంతో జరిగిన ఈ సమావేశంలో ‘నీట్‌ ’ లీకేజీపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు రౌండ్ టేబుల్ సమావేశపు ఆహ్వాన పత్రికను అందజేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో వరుసగా అనేక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని వారు మండిపడ్డారు. ముఖ్యంగా వైద్య రంగం లాంటి అత్యంత బాధ్యతాయుతమైన రంగానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు జరగడం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ లీకేజీల వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు ఉందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు, ఈ అక్రమాలపై తదుపరి కార్యాచరణను రూపొందించేందుకు లెఫ్ట్ విద్యార్థి సంఘాల జేఏసీ (ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ (విజృంభణ), జీఆర్పీడీఎస్‌, ఏఐడీఎస్‌వో, ఎఐఎఫ్‌డీఎస్) ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కేటీఆర్‌ని కలిసిన ఈ ప్రతినిధి బృందంలో ఏఐఎసఎఫ్ నుండి గ్యార నరేష్, ఎసఎఫఐ నుండి కిరణ్, అశోక్‌రెడ్డి, పీడీఎస్‌యూ నుండి పొడిపొంగి నాగరాజు, పి.మహేష్, జీఆర్ పీడీఎస్‌యూ నుండి డాక్టర్ ఎస్.నాగేశ్వర రావు, ఎన్.సుమంత్, పీడీఎస్‌యూ (విజృంభణ) నుండి అల్లూరి విజయ్, అనిల్, శివ, పల్లె మురళి, నితీష్, తీగల శ్యామ్ తదితర ముఖ్య నాయకులు ఉన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *