Take a fresh look at your lifestyle.

ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ‌దుకాణం నడుస్తుంది… భవిష్యత్‌లో కాంగ్రెస్‌ది నడుస్తది

  • తలసాని గొప్పలకు పోయి ప్రభుత్వాన్ని బదునాం చేస్తుండ్రు..
  • ఎల్‌ఆర్‌ఎస్‌పైనా సూచనకు స్పందించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు
  • ఇంకా తగ్గిస్తే ప్రజలు సంతోషిస్తారు…
  • హరీష్‌రావుకు, నాకు పంచాయతీ వొడువదు… : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఉండటంతో ఇప్పుడు వారి దుకాణం నడుస్తుందనీ…భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల హవా నడుస్తుందన్నారు. అధికారం ఎప్పుడూ, ఎవరికీ శాశ్వతం కాదన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ‌గొప్పలకు పోయి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వాన్ని బదునాం చేస్తుండన్నారు. ఈ మేరకు జగ్గారెడ్డి బుధవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…గత జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి అభ్యర్థులు లేక కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలకే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ టికెట్‌ ఇచ్చారనే విషయం మంత్రి తలసాని మర్చిపోవద్దన్నారు. ఈరోజు రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ
అధికారం ఉంది. అంటే మీ దుకాణం నడుస్తుంది.

భవిష్యత్‌లో మా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం వచ్చాక మా దుకాణం నడుస్తోందన్నారు. ఎవరిది ప్రభుత్వం ఉంటే వారి దుకాణమే(అధికారం) నడుస్తుందన్నారు. ఎంతటివారైనా ఏదో ఒక రోజు వోటమి చవిచూడాల్సిందేననీ అన్నారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికల్లో వోటర్లు ఎవరికి ఎలా షాకిస్తారో తెల్వదన్నారు. జీహెచ్‌ఎం‌సీలో కాంగ్రెస్‌ ‌మేయర్‌ ‌వస్తే…ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఇప్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ ‌మేయర్‌ను గెలిపిస్తే..ప్రతిపక్షంగా హైదరాబాద్‌ ‌సమస్యలపై ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతుందన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ దగ్గర మస్త్ ‌పైసలున్నాయి. వోటుకు 5వేల రూపాయల నుంచి 10వేల వరకు ఇస్తారన్నారు. అయితే, వోటర్లు టిఆర్‌ఎస్‌ ‌దగ్గర పైసలు తీసుకోని కాంగ్రెస్‌కు వోటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టిఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో ఒక్కరంటే ఒక్కరైనా బయట ప్రపంచంలో కనబడుతున్నారా? అని ప్రశ్నించారు. తమ పార్టీలో మిగిలిన 6 మంది ఎమ్మెల్యేలు 110మందికి గట్టి జవాబు ఇస్తున్నామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై తాను సూచించిన ప్రతిపాదనకు మంత్రి కేటీఆర్‌ ‌సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ ‌చార్జీలను ఇంకా తగ్గించాలని జగ్గారెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ‌గడువు ఏడాది పొడిగించాలన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌పై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాలో వివిధ కథ•నాలు వచ్చాయనీ, మీడియాలో వచ్చిన కథనాలపై సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తీసుకున్నాననీ, సభలో ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని, అలా కుదరని పక్షంలో నామ మాత్రపు రేట్లు విధించాలని కోరాననీ, ఎల్‌ఆర్‌ఎస్‌ ‌చేసుకోవడానికి ఏడాది సమయం కావాలని కోరానని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విధించిన రుసుములో 50శాతం తగ్గిస్తే ప్రజలకు లాభం జరుగుతుందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ‌రేటు ఇంకా కొంత తగ్గిస్తే ప్రజలు సంతోషిస్తారనీ, కొరోనా దృష్ట్యా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్‌ ‌జరిగేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నాననీ అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ‌విషయంలో మాట్లాడేందుకు సిఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ను సమయం ఇవ్వాలని కోరుతానన్నారు. తనకు మంత్రి హరీష్‌ ‌రావుకు పంచాయతీ ఒడవదనీ..అందుకే తమ మంత్రిని కలవననన్నారు. తాను స్ట్రెయిట్‌ ‌ఫార్వార్డ్.. ‌హరీష్‌ ‌రావు అలా ఉండడనీ అందుకే తామిద్దరం కలవమన్నారు. తలసాని గొప్పలు మాట్లాడి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని చెప్పారు. లక్ష డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇళ్లు చూపిస్తానన్న తలసాని 15వేలు చూపలేకపోయారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply