మల్లన్న సాగర్ లో పసుపు, కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి.

కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి  హ‌రీష్ రావు పిలుపు

ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ (Mallanna Sagar Reservoir ) లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటూ హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ఇంత‌కాలం కాంగ్రెస్ నేతలు కాలేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ 21 టీఎంసీల నీటితో ఒక సముద్రంలాగా కనిపిస్తోంద‌ని ఈ దృశ్యాన్ని చూసి కడుపు నిండిపోయింద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని, కాళేశ్వరం మునిగిపోయిందనే వాళ్ళకి చెంపపెట్టు లాంటి సమాధానం ఈ మల్లన్న సాగరే చెబుతోందని, లక్ష కోట్లు వృథా అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అబద్ధం అని గలగల పారుతున్న గోదావరి నీళ్ళే సమాధానం చెబుతున్నాయ‌ని అన్నారు.

మల్లన్న సాగర్ కు రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు విడుదలైన సందర్భంగా హ‌రీష్ రావు శుక్ర‌వారం ప్రాజెక్ట్ ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయ‌న వెంట ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ..కాలేశ్వరం కొట్టుకుపోయి ఉంటే ఈరోజు మల్లన్న సాగర్ లో 21 టిఎంసిల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ నాయకులు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి అన్నపూర్ణ మ్యారేజ్ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాలేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడంవల్లే సాధ్యమైంది. మల్లన్న సాగర్ నిండు కుండలా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా అని ప్ర‌శ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టు కింద పండే ప్రతీ పంటలో కేసీఆర్ పేరు ఉంది. ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్ పేరు నిలబడి ఉంటుంది. కాలేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖుపు ప్రచారాన్ని కాంగ్రెస్ మానుకోవాలి. కెసిఆర్ కట్టించిన అన్నపూర్ణలో మూడు టిఎంసిలు, రంగనాయక సాగర్ లో మూడు టీఎంసీలు, మల్లన్న సాగర్ లో 21 టీఎంసీలు నింపుకున్నాం. కొండపోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికి దుష్ప్రచారం చేస్తున్నారనిని హరీష్ రావు విమర్శించారు.

మల్లన్న సాగర్ లో మొదటిసారి 21 టీఎంసీ నీళ్లు నిండడం చూసి చాలా సంతోషంగా ఉందని హరీష్ రావు అన్నారు. మల్లన్న సాగర్ పూర్తయింది. కాలువలు కూడా 90% పూర్తయ్యాయి. మిగతా పది శాతం పిల్ల కాలువలను ప్రభుత్వం పూర్తిచేయాలని కోరారు. యాసంగి పంటకు బ్రహ్మాండంగా మూడు నాలుగు జిల్లాలకు నీళ్లు రాబోతున్నాయని, రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు మంచినీళ్లు తీసుకపోతా, మూసికి నీళ్లు తీసుకుపోతా అని అంటున్నాడంటే అందుకు కేసీఆర్  కట్టించిన కాలేశ్వరం మల్లన్న సాగరే దిక్కు అయిందని తెలిపారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మూసిని శుభ్రం చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని  హైదరాబాద్ కు తాగునీరు మల్లన్న సాగర్ నుంచి అందిస్తామని చెప్తున్నాడని,  కాలేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అది ఎలా సాధ్యమవుందని హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు అబద్ధాలు ప్రచారం చేశారు. లక్ష కోట్లు వృథా అయ్యాయని సర్వం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేశారని,  అయిందే 93,000 కోట్ల ఖర్చు అయితే లక్ష కోట్లు వృథా అయ్యాయని విష ప్రచారం చేశారన్నారు. పోయినసారి ఆగస్టు నెలలో చేప పిల్లలు వేసాం. ఈసారి సెప్టెంబర్ చివరికి వచ్చినా ఇప్పటివరకు చేప పిల్లలు పంపిణీ చేయలేదు. కెసిఆర్ పుణ్యమా అని చెరువులు మంచిగైనాయి. నదులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్. కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు. అన్ని చెరువులు నిండుకుండలా ఉన్నాయి. ఎప్పటిలోగా చేప పిల్లల పంపిణీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. అన్ని చెరువుల్లో, ప్రాజెక్టుల్లో రొయ్యలు, చేపలు వేసి బెస్త, ముదిరాజ్ సోదరులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *