నిరంకుశ విధానాలను ప్రజాస్వామ్యంలోఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం. ప్రజల మనసెరిగి ముందుకు సాగితే ఎంతకాలమైనా ప్రజలు ఆదరిస్తారు. కానీ నిరంకుశంగా, తమకు తిరుగు లేదన్నట్లుగా పాలించి కెసిఆర్, జగన్ పదవీచ్యుతి పొందారు. వీరు చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోయాయి. కొత్తగా వొచ్చిన ప్రభుత్వాలకు ఇప్పుడు అప్పులు మెడకు చుట్టుకున్నాయి. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదు. దీంతో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ అనుత్పాదక రంగాలకు విపరీతంగా దుబారా చేస్తున్నాయి. వీటినే అభివృద్ది, సంక్షేమం అంటే వోటు బ్యాంకును పటిష్టం చేసుకునే పనిలో ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణతో పాటు, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించకుంటే మట్టి కరచిపోతాయని గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ప్రధానంగా అభివృద్ది పేరుతో చేస్తున్న డబ్బు పందేరాలు రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి.
ఈ అప్పులనుంచి బయటపడే మార్గాలు కూడా కనిపించడం లేదు. అలాగే అభివృద్ది పూర్తిగా కుంటుపడిరది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలను దెబ్బతీయడం, విమర్శలను సహించకపోవడం వంటి చర్యలతో ఇద్దరు సిఎంలు నిరంకుశంగా పనిచేసారు. ఎపిలో జగన్ ప్రభుత్వం విపక్షాలను అణచివేయడం, కేసులు పెట్టడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. పార్టీలను అణగదొక్కడంలో కెసిఆర్ చేసిన కృషి ఇప్పుడు ఆయనకే ఎదురు తిరిగింది. కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలన్న కుట్రతో చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు బిజెపి సవాల్ విసిరే స్థాయికి చేరింది. కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణలో ఉనికి లేకుండా పోవాలని కెసిఆర్ వేసిన ఎత్తుగడలు ఫలించాయి. ఆయన దెబ్బకు టిడిపి ఉనికిలేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్ అనూహ్యంగా అధికారం చేజిక్కించుకుంది. అలాగే అనూహ్యంగా బిజెపి బలం పుంజుకుంది. దీంతో వారిని ఎదుర్కొనే క్రమంలో ఎదురుదాడి చేస్తూ బిఆర్‌ఎస్ కేంద్రాన్ని దుమ్మెత్తి పోసే పనిపెట్టుకున్నారు. బెంగాల్లో కమ్యూనిస్టులు ఇదే ధోరణిలో 30 ఏళ్లపాటు రాజ్యమేలారు.
తమకు తిరుగు లేదన్న ధోరణిలో వారు ప్రజల ఆశలను, ఆకాంక్షలను పట్టించు కోలేదు. తమ నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యం, అభివృద్ది ముసుగేసారు. కానీ అక్కడా మమతా బెనర్జీ లాంటి వారు పుట్టుకుని వచ్చారు. కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో పెకిలించారు. అయితే ఆమె కూడా అదే ధోరణిలో నిరంకుశ పాలన సాగించడంతో ఇప్పుడు మమతా బెనర్జీ పునాదులు కూడా కదులుతున్నాయి. బిజెపి అక్కడ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. నిరాశా నిస్పృహలతో ఉన్న మమతా బెనర్జీ బిజెపి నేతలపై దాడులకు దిగుతోంది. ఇటీవల తమిళనాడులో కూడా స్టాలిన్ ఇదే కోవలో ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రజలను సంతృప్తి పరచేలా పాలన అందించినంతవరకు పాలక పార్టీకి దిగులు లేదు.
అయితే ఇది విస్మరించి వ్యహరించడంవల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, బెంగాల్ తదితర రాష్టాల్ల్రో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. ప్రజల్లో నిరసనలు నివురుగప్పితే నాయకుడు ఏ పార్టీలో అయినా పుట్టుకుని వొస్తారని గమనించలేదు. ఈ కారణంగా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కావాలనుకున్న వారికి బీజేపీనే కనిపిస్తున్నది. కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం. మోదీ, అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ గతంలో అద్వానీ, వాజ్‌పేయిల ఆధ్వర్యంలో ఉన్న బిజెపికి భిన్నంగా వ్యవహరిస్తోంది. భిన్నంగా దూసుకుపోతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ముందుకు సాగుతోంది. తెలంగాణ బిజెపిలో ఇప్పుడు నాయకత్వం కూడా బలంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పుకునే కేసీఆర్ మొత్తంగా తన కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించి పనిచేస్తున్నారని ప్రజలు బలంగా నమ్మారు. దీంతో ఇక్కడ కెసిఆర్, అక్కడ జగన్ అధికారం కోల్పోక తప్పలేదు.
-ఎం.అజయ్ కుమార్