రైతు రుణమాపీ అయింది కొందరికే..
కాంగ్రెస్ వి విఫల హామీలు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోందని, అంకెల గారడీలతో ప్రజలను నిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయడమే మొదటి లక్ష్యమని వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ చెప్పిందని, కానీ అధికారంలోకి వచ్చిన 224 రోజుల తర్వాత రైతుల రుణాల్లో సగం మాత్రమే మాఫీ అయ్యాయని ఆరోపించారు. పచ్చి అబద్ధంతో తెలంగాణ రైతులను నిట్టనిలువునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. 26 ఆగస్టు, 2024 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.31వేల కోట్లు.. మాఫీ చేశామని చెప్పారు. కానీ నిన్న ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో.. రూ.17వేల కోట్ల రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు.
మరి మిగిలిన రూ.14వేల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మరో 16 లక్షలకు పైగా రైతులకు ఇంకా ఎందుకు రుణమాఫీ జరగలేదని ఇది కాంగ్రెస్ పార్టీ మోసాల జాబితాలో మరో మోసంమని చెప్పారు. మొదట్లో.. రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ అని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు మాటమార్చి.. ఒక కుటుంబానికి ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడం.. మరో మోసమని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ అనే మాట నుంచి.. కొందరు రైతులకే రుణమాఫీ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అసలు తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న రైతులెందరు? రూ.2 లక్షల్లోపు రుణాలున్నవారెందరు? మీరు రుణమాఫీ చేసిన వారెందరు? ఈ లెక్కలన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాలని, మీరు చెప్పిన దాంట్లో మూడో వంతు వారికి కూడా జరగలేదనేది వాస్తవమని అన్నారు. బూటకపు హామీలు ఇవ్వడం, వాటిని అమలుచేయకపోవడం తద్వారా రాష్ట్రంలోని అందరు రైతులకు మోసం చేయడం.. కాంగ్రెస్ పార్టీ విఫల హామీలకు పరాకాష్ట అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. .