రైతులను గోసపెట్టిన బీఆర్ఎస్ ను ఎవరూ నమ్మరు

– కుట్రలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు
– ప్రజా దర్బార్ లో మంత్రి పొంగులేటి 

ఏదులాపురం/ ఖమ్మం, ప్రజాతంత్ర, మే 14: పదేళ్లపాటు అధికార దాహంలో పేదవాడిని విస్మరించి నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వారు నేడు రంగురంగుల అవతారాలతో వస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రతి పక్షాలపై విరుచుకుపడ్డారు. ఖమ్మం నగర సమీపంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ క్లస్టర్-1 సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. నాడు అధికారంలో ఉండి వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టిన దొరవారు, నేడు రైతుల కోసం పోరాడుతున్నామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మీ పదేళ్ల పాలనలో అధికారులు ఏనాడూ పేదల వద్దకు రాలేదు.. కానీ ఈనాడు మేమే స్వయం గా ప్రజల గడప వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఒంటి నిం డా విషాన్ని నింపుకొని విషం కక్కుతున్నాయ ని మంత్రి మండిపడ్డారు. మూడు నాలుగు సా ర్లు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మీకు జ్ఞా నం రాలేదు. కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే మీ కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని బీఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు. ప్రజా దీవెనలు ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. సోల్లు పురాణం చెప్పే ప్రభుత్వం మాది కాదు.. చేతల ప్రభుత్వం. ఇప్పటికే 73 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగులకు త్వరలోనే మరిన్ని శుభవార్తలు చెబుతాం. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కాగితాలకే పరిమితం చేస్తే, మేము ఒక్క రూపాయి అవినీతి లేకుండా రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివా కర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, 15 వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

వనజీవి రామయ్య స్మారక చిహ్నానికి జూన్‌లో శంకుస్థాపన

పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జ్ఞాపకార్థం జూన్ లో స్మారక చిహ్నానికి శంకుస్థాపన చేస్తామని, ఆయన భార్య జానమ్మకు తప్పకుండా పింఛన్ అందజేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం క్లస్టర్ పరిధిలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాదర్బార్‌కు వచ్చిన రామయ్య భార్యకు పైవిధంగా హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి వెంటనే స్థలసేకరణ చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. వృక్షోరక్షితి రక్షిత: అని చెట్ల పెంపకం కోసం కృషి చేస్తూ కోటికిపైగా మొక్కలను నాటి జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి  పద్మశ్రీ వనజీవి రామయ్య స్మారకాన్ని ఏర్పాటు చేసుకుని వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

సమస్యల పరిష్కారమే పరమావధి : రామన్నపేట ప్రజా దర్బార్‌లో 

ఖమ్మం : పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం నుంచి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం వరకు ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం కార్పొరేషన్ 1, 59, 60 డివిజన్ల ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రామన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి మాట్లాడారు.

అర్హతే ప్రామాణికం.. అండగా ప్రభుత్వం
ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడవ ఏట అడుగుపెట్టిన సందర్భంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని, తమ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. కేవలం మంజూరు చేయడమే కాక ప్రతి సోమవారం పనుల పురోగతినిబట్టి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం ద్వారా ధరణి కష్టాలను తొలగిస్తున్నామన్నారు.

సమస్యలకు పరిష్కార వేదిక ‘ప్రజా దర్బార్’
నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇది 13వ క్లస్టర్ అని మంత్రి తెలిపారు. చిన్నచిన్న సమస్యలను వేదికపైనే పరిష్కరించేలా అధికారులను ఆదేశించడమే కాక వారం రోజుల్లో పరిష్కరించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మూడు నెలల లోపు ప్రతీ న్యాయమైన అర్జీని పరిష్కరించి తీరుతామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి ప్రతి శాఖను విశ్లేషించి, ప్రజలకు మేలు చేయడమే ఈ 99 రోజుల కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

అభివృద్ధి చూపించి మళ్లీ ఓట్లు అడుగుతా

రెండేళ్ల క్రితం ఈ డివిజన్లలో రోడ్లు, కరెంటు, తాగునీటి పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలే ఆలోచించాలని మంత్రి అన్నారు. ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సి ఉందని, ఆ పనులు కూడా పూర్తి చేశాకే మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని ఆయన స్పష్టం చేశారు. మాటలు చెప్పడం కాదు.. పని చేసి చూపించడమే తన నైజమని ఉద్ఘాటించారు. సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు పేద ఇంటి గుమ్మానికి చేరుతున్నాయని మంత్రి తెలిపారు. విద్యార్థుల కోసం డైట్ చార్జీలను 40 శాతం, ఆడపిల్లల కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఆసరా పెన్షన్ల మంజూరులో గత ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు అర్హులైన వితంతువులు, వయోవృద్ధుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ, అడిషనల్ డీసీపీ రామానుజం, వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ అధికారులు, ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *