సుప్రీంకోర్టుకు సిఎం రేవంత్‌ ‌బేషరతు క్షమాపణ

ఎక్స్ ‌వేదికగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సీఎం ఎక్స్ ‌వేదికగా ట్వీట్‌ ‌చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ‌పిటిషన్‌ ‌విషయంలో తన కామెంట్లు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ఈ ట్వీట్‌లో వెల్లడించారు. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. దిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేవంత్‌.. ‌శుక్రవారం ‘ఎక్స్’ ‌వేదికగా పోస్టు పెట్టారు. ‘నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారు.

పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను.. ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటా‘ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయి, జస్టిస్‌ ‌కేవీ విశ్వనాథన్‌లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ’ముఖ్యమంత్రి ప్రకటనలను ఈ రోజు పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి? మేం రాజకీయపార్టీలను సంప్రదించో.. లేక రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా?’ అని ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన వ్యాఖ్యలపై తాజాగా స్పష్టతనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page