బహుముఖ కార్యాచరణ చారిత్రక అవసరం..!

ఆంధ్రప్రదేశ్‌ను విభజించి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయి, మీది, మాది అనే బావనతో రాజకీయాలకు లొంగిపోయి అగుపడనం త దూరంలో పొరపొచ్చాలతో బతుకాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన దేశంలో ఏ రాష్ట్ర విభజన విషయంలో జరుగనంత రసాభస జరిగి విభజన చోటుచేసుకున్నది.
ఇదే అదనుగా విభజించి పాలించు అనే సూత్రాన్ని ఒంటబట్టించుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్‌ కు చంద్రబాబు మధ్యలో కొంత అగాధం సృష్టించిం ది.రెండవ పర్యాయంలో కూడా జగన్‌ ను చంకన పెట్టుకొని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌ పై అప్రకటిత యుద్ధం ప్రకటించింది. అయితే కేసీఆర్‌ ఏమి సుద్దపూస కాదు. తెలుగు రాష్ట్రాలకు సంబందించిన నిధులు, నీళ్లు, నియామకాలు పంపకాలలో తేల్చకుండా ‘జో హుకుం’ అనే వ్యక్తులకు భజన చేసిన పరిస్థితి రెండు టర్మ్‌ లలో కొట్టొచ్చినట్టు కన్పించింది.

కేసీఆర్‌ కు వంతపాడి ఎన్డీఏ లో భాగస్వామి అయిన చంద్రబాబును సైతం తోక కత్తిరించే పనిలో మోహమాటం పడలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కుండబద్దలు కొట్టినట్టు ప్రజాక్షేత్రంలో నిలబెట్టి, కేంద్ర ప్రభుత్వ కపటనీతిని ఎండకట్టినందుకు అందుకే అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.జగన్‌ కేసీఆర్‌ మీటింగ్‌ తో పరిష్కారానికి నోచుకుంటాయని రెండు రాష్ట్రాల ప్రజలు భావించాయి, కానీ ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలుపొందడానికి చేసిన కుయుక్తులుగా ప్రయత్నం చేసినట్టు కన్పించింది. ఎందుకంటే ఫలితం శూన్యం అయినందున  ఇద్దరినీ ఆయా రాష్ట్రాల ప్రజలు నమ్మలేదు.విలువలు లేని రాజకీయాలు నడపడంలో ఒకరినిమించిన మించి ఒకరు పోటీ పడి అధికార దురంహాకారం మేలుకలయికగా సాగించిన పాలనకు చరమగీతం పాడారు.

ఆదర్శం అపురూపమైనది. అబ్బురపరిచేది. ఒక లక్ష్యాన్ని,అది అసాధ్యమైనదని అనిపిస్తున్నా, అందుకో వాలనే ఆసక్తినో,అనురక్తినో ప్రేరేపించగలిగే లక్షణం ఆదర్శంలో ఉంటుంది. నీళ్లు,నిధులు, స్థిర ఆస్తులకు  సంబందించిన విషయానికి వస్తే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు వాళ్ళంతట వాళ్లే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించి వివాదాలు పరిష్కరించుకొని తెలుగువారు భౌగోళికంగా విడిపోయినా, మానసికంగా ఒకటే అని చాటడానికి మూడవ దఫా పాలనలో గురు,శిష్యులు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉండడం విభజన సమస్యలు, ఇచ్చి,పుచ్చుకోవడాలు, అన్నదమ్ములు వాటాలుగా పంచుకున్నట్లుగా ఉన్నది. చంద్రబాబు, రేవంత్‌ తెలివైన వారు, విజ్ఞులు అందుకేనేమో రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దం తర్వాత తెలివిగా ప్రభుత్వాది óనేతలుగా ఎంచుకున్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎన్నివిధాలుగా ప్రయత్నించినా  కానీ అనేక సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు.ప్రస్తుతం వారు స్టేట్స్‌ మెన్‌ గా నిరూపించుకునే తరుణం ఆసన్నం అయ్యింది.

చెడిపోయిన ఆంధ్ర, తెలంగాణ సంబంధాలను పునరుజ్జీవం పోసేందుకు ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనుకకు వేసి మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటున్నాం అనే సంకేతాన్ని కేంద్రానికి ఇచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో కలుపుకున్న పోలవరం ముంపు ఏడూ మండలాల్లో తెలంగాణ భూభాగం  భద్రాచలం అనుకోని ఉన్న ఐదు గ్రామాలు అప్పగింతకు ఏపీ సీఎం చంద్రబాబు సరేనని చెప్పడం, కృష్ణ నీటి పంపకాలపై సానుకూలంగా స్పందించడం, పదేండ్లుగా పరిష్కారం చూపని అన్ని సమస్యలకు ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఆయన శిష్యుడు సీఎం గా రేవంత్‌ ఉండడం మూలానా భేషజాలకు పోకుండా ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టకుండా అభివృద్ధికి బాటలు వేసేందుకు ఒకరికి ఒకరు సహకారం అందుంచుకోవాలని ఒప్పందం చేసుకోవడం ముదావహం. తల్లిని చంపి బిడ్డను వేరు చేసారని ఊకదంపుడు మాటలు చెప్పిన మోడీ ఆంద్రప్రదేశ్‌ కు ఏమి మేలు చేసింది కూడా ఏమి లేదనే విమర్శ ఉంది.

ఆంధ్రా నాయకులు, కొందరు మేధావులు విభజన చాలా అన్యాయంగా, అహేతుకంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇదివరకు అన్ని రాష్ట్రాలను విభజిం చినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కూడా  విభజించారు, ఆస్తులు, అప్పుల పంపకాలు కూడా ఇదివరకు విభజన చట్టాలలోని విధివిధానాలే ఉపయోగించారు. విభజన సరిగా జరుగలేదు అన్యాయం జరిగిందని తప్పుడు వాదన, అది వాళ్ల రాజకీయం. నాలుగు ఓట్లు సంపాదించడానికి తప్ప, దాంట్లో ఏ మాత్రం నిజం లేదు. అయితే ఉద్యమ సమయంలో రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలుగా కలిసివుందాం అనే నినాదంతో రాజకీయ మార్గాలు ఏవిధంగా వున్నా సరే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి,మెలిసి వుంటాయని, పొరపచ్చాలు, అపోహలకు తావులేకుండా గురు,శిష్యుల మధ్య రాజకీయ పరిణితి పుష్కలంగా కన్పించింది. రేవంత్‌ తీరు మాత్రం ప్రజా కవి కాళోజి చెప్పినట్టుగా ‘దోస్తుగా ఉండే వారితో దోస్తే చేస్తం అన్న సందేశం  ‘నా గొడవ’ అందించి ప్రతిపక్షాలకు చెప్పకనే చెప్పినారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంల భేటీ అందుకు దోహదపడొచ్చు.

ఆదర్శం కీర్తిని ఎరగా వేసి అసంభావ్యతను ఊరిస్తే , ఆచరణ ఫలితాల గీటురాయిపై పరీక్షకు నిలవాల్సి ఉంటుంది. ఆదర్శం కల్పన, ఆచరణ నిజం. రేవంత్‌, చంద్రబాబు చారిత్రక అవసరాన్ని గుర్తించి తెలుగు ప్రజలకు మేలుచేసే విజ్ఞులు కూడా, తెలంగాణ, ఆంధ్ర నాయకత్వం ఇప్పటికీ తమకే అన్యాయం జరిగిందని చెయ్య వలసిన పనులు చెయ్యకుండా ఇంకా ఏవేవో గొంతెమ్మ కోరికలు కోరకుండా ఇక్కడి, అక్కడి మేధావులకు, తెలుగు ప్రజలకు సరైన సమాచారం అందజేసి కార్యోన్ముఖులను చేస్తే సాధించనిది ఏమిలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కలిసి విభజన మన రాష్ట్రానికి ఆ చట్టంలో పొందుపర్చినవి సాధించే ప్రయత్నాలు చేస్తారని కోరుకొందాం.. అండగా నిలుద్దాం. ఆచరణ సాధ్యమయ్యే దాన్నీ చేయలేకపోవడం క్షమించరాని వైఫల్యం అని నమ్మిన బలమైన నాయకులు ముఖ్యమంత్రులుగా ఉండడం వల్లనే గిల్లికజ్జాలకు  వెళ్లకుండా పరిష్కారం కోసం ముందడుగు వేసినారనే అభిప్రాయం అందరిలో నెలకొంది.

డా. సంగనిమల్లేశ్వర్‌
విభాగాధిపతి, జర్నలిజంశాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌,
సెల్‌ : 9866255355.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page